రోజుకు 250 విచారణలు పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

రోజుకు 250 విచారణలు పూర్తి చేయాలి

Aug 12 2026 2:58 AM | Updated on Aug 12 2026 2:58 AM

కర్నూలు(సెంట్రల్‌): ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా పెండింగ్‌ నోటీసుల అందజేత, విచారణను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సిరి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌ నుంచి సర్‌, రీసర్వే ప్రక్రియలపై కలెక్టర్‌ సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెండింగ్‌ నోటీసులను శనివారంలోపు సంబంధిత ఓటర్లకు అందించాలన్నారు. ప్రతి ఏఈఆర్‌ఓ రోజుకు కనీసం 250 విచారణలు పూర్తి చేయాలన్నారు. విచారణ అనంతరం ఎలాటి జాప్యం లేకుండా బీఎల్‌ఓ యాప్‌లో నమోదు చేయాలన్నారు. ఓటరు జాబితాల్లో అచ్చుతప్పులు లేకుండా సంబంధిత ఓటర్లతో అండర్‌టేకింగ్‌ తీసుకొని సరిచేయాలని ఆదేశించారు. సమీక్షలో జేసీ నూరుల్‌ ఖమర్‌, డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, కర్నూలు, పత్తికొండ, ఆదోని ఆర్డీఓలు సందీప్‌కుమార్‌, ఓబులేసు, అరుణాదేవి పాల్గొన్నారు.

గ్రామాల్లో

స్వచ్ఛత సాధనకు కృషి

కర్నూలు(అర్బన్‌): గ్రామాల్లో స్వచ్ఛత సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా పరిషత్‌ సీఈఓ ఆర్‌.సుధాకర్‌రెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక జెడ్పీలోని మినీ సమావేశ భవనంలో ఉమ్మడి జిల్లాకు చెందిన స్వచ్ఛాంద్ర కార్పొరేషన్‌ కన్సల్టెంట్లు, మండల రిసోర్స్‌ కోఆర్డినేటర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈఓ మాట్లాడుతూ తమ పరిధిలోని అన్ని గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్లు లేని వారిని గుర్తించి నిర్మించుకునేందుకు దరఖాస్తు చేయించాలన్నారు. ఓడీఎఫ్‌ ప్లస్‌ అయిన గ్రామాల వెరిఫికేషన్‌ పూర్తి చేయాలన్నారు. ముఖ్యంగా గ్రామాల్లో మురుగునీటి నిల్వను గుర్తించి ఇతర ప్రాంతాలకు మళ్లించి పరిశుభ్రంగా ఉంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ఇంటింటి చెత్త సేకరణలో భాగంగా స్వచ్ఛ రథాల ద్వారా పొడి చెత్తను సేకరించడంలో క్రియాశీలక పాత్ర పోషించాలన్నారు.

ముగ్గురు ఆర్‌యూ

విద్యార్థుల బహిష్కరణ

కర్నూలు కల్చరల్‌: రాయలసీమ విశ్వవిద్యాలయం పురుషుల హాస్టల్‌లో సోమవారం రాత్రి జరిగిన ఘర్షణలకు కారణమైన ముగ్గురు ఇంజినీరింగ్‌ విద్యార్థులను కళాశాల నుంచి బహిష్కరించినట్లు ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య పి.వెంకట సుందరానంద్‌ తెలిపారు. వీరితో పాటు మరో నలుగురు విద్యార్థులను కళాశాలతో పాటు హాస్టళ్ల నుంచి సస్పెండ్‌ చేసినట్లు పేర్కొన్నారు.

తహసీల్దార్‌ రాజీనామా..?

పాణ్యం: పాణ్యం తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రవీణ్‌కుమార్‌ రాజీనామా చేసినట్లు సమాచారం. రెండు నెలల క్రితం కర్నూలు నుంచి పదోన్నతిపై పాణ్యం తహసీల్దార్‌గా నియమితులయ్యారు. అయితే ఉన్నట్లుండి ఆయన రాజీనామా లేఖను నంద్యాల జిల్లా కలెక్టర్‌ రాజకుమారికి అందజేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఆయన రాజీనామాకు గల కారణాలు ఏమై ఉండవచ్చని రెవెన్యూ శాఖ చర్చనీయాంశంగా మారింది. తహసీల్దార్‌ రాజీనామా చేయడానికి కారణాలు ఏమిటని అధికారులు, నాయకులు చర్చించుకుంటున్నారు.

ఉచ్చులకు పులి బలి.. గుట్టుగా దహనం

ఆత్మకూరురూరల్‌: ఏడాది క్రితం ఆత్మకూరు డివిజన్‌లో నాగలూటి రేంజ్‌లో పెద్దపులి ఉచ్చులకు చిక్కుకుని మరణించిందనే వార్తల నేపథ్యంలో డిప్యూటీ డైరెక్టర్‌ విగ్నేష్‌ అపావ్‌ మంగళవారం సాయంత్రం ఒక ప్రకటనలో నిర్ధారించారు. గత సంవత్సరం సెప్టెంబర్‌లో ఇందిరేశ్వరం వెస్ట్‌బీట్‌లో కొత్తచెరువు సమీపంలోని తొట్టిమిట్టల ప్రాంతంలో ఒక పెద్దపులి ఉచ్చులకు చిక్కుకుని మరణించిన సంఘటన ఆలస్యంగా తెలిసిందని డీడీ తెలిపారు. పులి మరణించిన విషయం దాచి, అటవీ శాఖ సిబ్బంది ప్రొటోకాల్‌కు విరుద్ధంగా కళేబరాన్ని దహనం చేసిన సంఘటనకు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న వారిని విచారించి నిర్ధారించుకున్నామన్నారు. పులి కళేబరాన్ని దహనం చేసిన ప్రాంతంలో లభించిన ఎముకలు, బూడిద, మట్టిని సేకరించినట్లు ఆయన తెలిపారు. ఘటనపై యూడీఓఆర్‌ కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement