● చికిత్స ఆలస్యమై ఇబ్బంది పడ్డ రోగులు
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో జూనియర్ డాక్టర్లు మంగళవారం ఉదయం నుంచి సమ్మెకు దిగారు. స్టైఫండ్ పెంపునకు జూడాలు దశల వారీ ఆందోళనను ప్రకటించారు. ఈ మేరకు ఆసుపత్రిలోని అన్ని విభాగాల్లో ఓపీ, ఐపీ సేవలను బహిష్కరించి ర్యాలీ నిర్వహించారు. ఆయా విభాగాల వద్దకు వెళ్లి సమ్మె చేయడానికి కారణాలను వివరించారు. ఈ సందర్భంగా ఏపీ జూనియర్ డాక్టర్ల సంఘం కర్నూలు అధ్యక్షులు డాక్టర్ నిశాంత్ మాట్లాడుతూ స్టైఫండ్ పెంపు, తదితర డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో సమ్మె చేయాల్సి వచ్చిందన్నారు. 12వ తేది ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసర సేవలు మినహా అన్ని రకాల సేవలు నిలిపివేస్తామన్నారు. అప్పటికీ ప్రభుత్వం దిగి రాకపోతే ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కాగా జూడాలు సమ్మె చేయడంతో ఓపీ, ఐపీ సేవలపై ప్రభావం చూపింది. ఓపీలో జూడాలు లేకపోవడంతో అసిస్టెంట్ ప్రొఫెసర్లు మాత్రమే రోగులకు చికిత్స చేయాల్సి వచ్చింది. దీంతో రోగులకు చికిత్స ఆలస్యమై ప్రతిచోటా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.


