ఆయకట్టుకు ‘కన్నీళ్లే’! | - | Sakshi
Sakshi News home page

ఆయకట్టుకు ‘కన్నీళ్లే’!

Aug 12 2026 2:58 AM | Updated on Aug 12 2026 2:58 AM

తాగునీటికే ప్రాధాన్యం

తుంగభద్ర జలాలు

తాగునీటికేనని తేల్చిన ప్రభుత్వం

కర్నూలు(సిటీ): టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం ఆయకట్టు రైతులకు శాపంగా మారుతోంది. తుంగభద్ర డ్యాంలోకి నీరొస్తుందనే ఆశతో వేలాది మంది ఆయకట్టు రైతులు చిన్నపాటి వర్షాలకు పంటలను సాగు చేసి రెండు నెలలు దాటిపోతున్నా చినుకు జాడ కరువైంది. ఎండుతున్న పంటలను చూసి రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి సమయంలో మంగళవారం కర్ణాటకలో నిర్వహించిన రాష్ట్ర నీటి పారుదల సలహా కమిటీ(ఐసీసీ) సమావేశంపై రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే సమావేశానికి ముందు రోజు కర్ణాటక నీటిసారుదల ఇంజనీర్లు ఏపీకి చెందిన తుంగభద్ర ఎగువ, తుంగభద్ర దిగువ కాల్వల పర్యవేక్షక ఇంజనీర్లతో చర్చలు నిర్వహించారు. తమ రాష్ట్రంలోని సాగునీటి కాలువల కింద ఆరుతడి పంటలకు 90 రోజుల పాటు నీళ్లిస్తున్నామని, మా కోటా నీటికి తోడు ఏపీ వాటా నీరు కలిపి కాల్వలో వదిలితే ఎక్కువ నీరొస్తుందని కోరారు. అయితే ప్రస్తుతం ఏపీలోని రాయలసీమ జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులతో తాగు నీటి అవసరాలు మాత్రమే తీరితే చాలని.. ఆయకట్టుకు నీరు ఇవ్వలేమని ప్రభుత్వం మాటగా ఇంజనీర్లు తేల్చి చెప్పడం గమనార్హం. ప్రస్తుతం టీబీ డ్యాంలోకి 37 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. కేడబ్ల్యూడీటీ–1 ప్రకారం రాయలసీమ జిల్లాల్లోని తుంగభద్ర ఎగువ కాలువకు 29.5 టీఎంసీలు, తుంగభద్ర దిగువ కాలువకు 32.5 టీఎంసీలు, కర్నూలు–కడప కాలువకు 39.90 టీఎంసీల(ఇందులో 29.9 టీఎంసీలు తుంగభద్ర నదీ ప్రవాహం నీటి నుంచి, 10 టీఎంసీలు టీబీ డ్యాంలో నిల్వ నీటి నుంచి) నీటి వాటాలు ఉన్నాయి. ఆ నీటిపై ఆధారపడి సుమారు 8.53 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. వర్షాకాలం వచ్చి రెండు నెలలు అవుతున్నా ఇప్పటి వరకు టీబీ డ్యాంలో ఆశించిన మేర నీటి చేరికలు లేకపోవడం ఆందోళన కలిగించే విషయం. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఏపీ ప్రభుత్వం డ్యాంలోకి వచ్చిన నీటిలో దామాషా ప్రకారం వచ్చే నీటిని కేవలం తాగునీటికే వినియోగిస్తామని, ఆయకట్టుకు నీరు ఇవ్వలేమని చెబుతుండటం గమనార్హం.

తుంగభద్ర డ్యాంలో ఈ ఏడాది ఇప్పటి వరకు 83 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అంచనాల మేరకు నీటి లభ్యత లేకపోవడంతో ముందుగా తాగునీటికి ప్రాధా న్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో తాగునీటి అవసరాలకు 13 టీఎంసీలు వచ్చే ఏడాది మే నెల 31వ తేదీ వరకు కావాలి. దామాషా ప్రకారం అందుబాటులో ఉన్న నీరు మొత్తం తాగుకే సరిపోతుంది. మున్ముందు వచ్చే నీటిని బట్టి నిర్ణయాలు ఉంటాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయకట్టుకు నీళ్లిచ్చే పరిస్థితులు లేవు. – కబీర్‌ బాషా,

జల వనరుల శాఖ కర్నూలు ప్రాజెక్ట్సు సీఈ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement