కర్నూలు(టౌన్): మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 13న కర్నూలుకు వస్తున్నట్లు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. మంగళవారం సాయంత్రం ఆయన పార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి స్వగృహంలో పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ, పార్టీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ తలశిల రఘరాం, జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి, పార్టీ కర్నూలు నియోజకవర్గ పరిశీలకులు చల్లా విఘ్నేశ్వర రెడ్డి, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షురాలు ఎస్వీ విజయమనోహరి, పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం కక్ష సాధింపులో భాగంగా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని అక్రమ కేసులో అరెస్టు చేసి జైలులో పెట్టిందన్నారు. అన్యాయంగా అరెస్టయిన ఎమ్మెల్యేతో పాటు ఇతర పార్టీ నాయకులను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ములాఖాత్ ద్వారా కలిసి పరామర్శిస్తారన్నారు. పార్టీ క్యాడర్‌లో భరోసా కల్పించేందుకు మాజీ సీఎం వస్తున్నారన్నారు. 13న గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి కర్నూలు ఓర్వకల్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారన్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నన్నూరు టోల్‌గేట్, టిడ్కో మీదుగా రింగ్ రోడ్డుపై గుత్తి పెట్రోల్ బంకు, చెన్నమ్మ సర్కిల్, బళ్లారి చౌరస్తా పైనుంచి వెంకటరమణ కాలనీ, సంతోష్ నగర్ మీదుగా పంచలింగాల జిల్లా కారాగారానికి చేరుకుంటారని తెలిపారు. జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ డీఎస్సీ స్కాంపై సీబీఐ విచారణ జరిపించాలని మహిళా నేతలు, పార్టీ నేతలు శాంతియుత ర్యాలీ చేస్తే 55 మందిపై అక్రమంగా కేసులు నమోదు చేయడం దారుణమన్నారు. కేసులకు భయపడేది లేదన్నారు. మహిళా పోలీసులు లేకుండా పోలీసులు దురుసుగా ప్రవర్తించడం ఎంతవరకు సమంజసమన్నారు. పలుమార్లు పోలీసులు అడ్డుకున్నా పార్టీ శ్రేణులు ర్యాలీని విజయవంతంగా పూర్తి చేశారని గుర్తు చేశారు.


