మంత్రాలయం రూరల్: భర్తతో గొడవ పడిన ఓ మహిళ ఏడాది వయస్సు ఉన్న బిడ్డను మంత్రాలయంలోని శ్రీ మఠం పరిమళ ప్రసాదం కౌంటర్ వద్ద వదిలేసి వెళ్లిపోయింది. ఎస్‌ఐ మల్లికార్జున తెలిపిన వివరాలు ఇవి.. నందవరం మండలం గురజాల గ్రామానికి చెందిన షేక్షావలి, బాను దంపతులకు ముగ్గురు కూతుర్లు, కుమారుడు ఉన్నారు. భర్తతో గొడవ పడిన మహిళ తన ఏడాది వయస్సు ఉన్న బిడ్డను బుధవారం ఉదయం 10 గంటల సమయంలో శ్రీమఠం కారిడార్‌లోని పరిమళ ప్రసాదం కౌంటర్ వద్ద వదిలేసి వెళ్లిపోయింది. చిన్నారిని శ్రీమఠం సెక్యరిటీ సిబ్బంది గుర్తించి పీఆర్‌ఓ అధికారుల ద్వారా పోలీసు స్టేషన్‌కు సమాచారం అందించారు. వారు పాప ఆచూకీ కోసం పలు సామాజిక గ్రూప్‌లో పెట్టారు. కాగా బాను ఇంటికి వెళ్లగా భర్త తన కుమార్తె గురించి ఆరా తీయగా మంత్రాలయంలో వదిలేసి వచ్చానని చెప్పడంతో వెంటనే అతను భార్యతో మంత్రాలయం చేరుకున్నాడు. శ్రీమఠం సెక్యూరిటీకి విషయం చెప్పగా వారు పోలీసు స్టేషన్ తీసుకెళ్లి అప్పగించారు. దంపతులకు కౌన్సిలింగ్ ఇచ్చి ఐసీడీఎస్ సూపర్‌వైజర్ సుమిత్రమ్మ, హెడ్ కానిస్టేబుల్ ఆంజినేయులు సమక్షంలో చిన్నారిని అప్పగించారు.


