కర్నూలు(అర్బన్): విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాక్‌లాగ్ ఉద్యోగాలకు తాత్కాలిక మెరిట్ జాబితా, తిరస్కరణ వివరాలను విడుదల చేసినట్లు ఆ శాఖ సహాయ సంచాలకులు రయిస్‌ఫాతిమా తెలిపారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఆయా కేటగిరీలకు సంబంధించి ల్యాబ్ టెక్నీషియన్, జానియర్ అసిస్టెంట్, జూనియర్ ఆడిటర్, టైపిస్టు, ఎల్‌డీ కంప్యూటర్, ఏఎన్‌ఎం గ్రేడ్ –3 పోస్టులకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరించామన్నారు. తమ కార్యాలయంలోని నోటీసు బోర్డులో, డిస్ట్రిక్ట్ వెబ్‌సైట్ https://kurnool.ap.gov.in లో జాబితాలను ఉంచామన్నారు. వివరాల్లో ఏవైనా ఆక్షేపణలు ఉంటే ఈ నెల 7వ తేది సాయంత్రం 5 గంటల్లోపు లిఖిత పూర్వకంగా తెలియజేయాలన్నారు. అలాగే కార్యాలయ మెయిల్ ఐడీ addwknl@gmail.comకి తగిన ఆధారాలతో తెలియజేయవచ్చన్నారు.
‘నీట్’ విద్యార్థిని ఆత్మహత్య
కోడుమూరు రూరల్: నీట్ పరీక్షలో మార్కులు తక్కువగా రావడంతో ఓ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అనుగొండ గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మాల వేణుగోపాల్‌కు పిల్లలు లేకపోవడంతో భార్య భాగ్యమ్మ తరపు బంధువులకు చెందిన పుష్పావతి(19)ని ఆరేళ్ల వయస్సులోనే తెచ్చుకొని పెంచుకుంటున్నారు. బాగా చదివించడం.. పుష్పావతి డాక్టర్ కావాలనుకోవడంతో ఇంటర్ బైపీసీ ఇప్పించగా 965మార్కులను సాధించింది. ఆ తర్వాత విజయవాడలోని ఓ ప్రైవేట్ నీట్ కోచింగ్ సెంటర్‌లో కోచింగ్ సైతం ఇప్పించి పరీక్షలు రాయించాడు. అయితే మొదటి సారి రాసిన నీట్ పరీక్ష పేపర్ లీకేజీతో క్యాన్సిల్ కావడంతో రెండవసారి పరీక్ష రాసింది. ఇటీవల వెలువడిన నీట్ ఫలితాల్లో తనకు 487మార్కులు వచ్చాయంటూ ఆ బాలిక వేణుగోపాల్‌కు చెప్పసాగింది. అయితే ఆయన ఈ రోజు కర్నూలుకు వెళ్లి పుష్పావతికి వచ్చిన మార్కులను చెక్ చేయగా నీట్ పరీక్షలో 347 మార్కులు మాత్రమే వచ్చాయంటూ ఫోన్ చేసి చెప్పాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన పుష్పావతి రూమ్‌లోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పిల్లలు లేకపోవడంతో ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న పుష్పావతి ఆత్మహత్యకు పాల్పడడంతో దంపతులు కన్నీరుమున్నీరయ్యారు. మృతురాలి సొంత తండ్రి కొండ్ర లక్ష్మీదాసు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోడుమూరు ఎస్‌ఐ ఎర్రిస్వామి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కర్నూలు(అర్బన్): తల్లి పాల ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ నెల 1 నుంచి 7వ తేది వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ సాధికారత అధికారి పి.విజయ తెలిపారు. ప్రసవించిన మొదటి గంటలోనే శిశువుకు తల్లిపాలు పట్టించాలని ఆమె శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే మొదటి ఆరు నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలన్నారు. వారోత్సవాల సందర్భంగా జిల్లాలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమాల్లో జిల్లాలోని గర్భిణిలు, బాలింతలు, కుటుంబ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు తమ పరిధిలో తప్పక పాల్గొనాలని ఆమె కోరారు.


