కొత్త పింఛన్లు లేనట్లే! | - | Sakshi
Sakshi News home page

కొత్త పింఛన్లు లేనట్లే!

Aug 1 2026 12:22 AM | Updated on Aug 1 2026 12:22 AM

వృద్ధులకు తప్పని ఎదురు చూపులు

దివ్యాంగులకు తొలగని కష్టాలు

నేడు ఆగస్టు నెల పింఛన్ల పంపిణీ

చిత్రంలో కనిపించే వృద్ధురాలి పేరు కటికే మాసూంబీ. ఎమ్మిగనూరు మండలం మసీదుపురం గ్రామానికి చెందిన ఈమెకు 73 ఏళ్ల వయస్సు ఉంది. నా అనే వాళ్లు లేరు. ఒంటరి మహిళ. కొన్ని నెలల కిత్రం వరకు ఎమ్మిగనూరు పట్టణంలోని సోమప్ప సర్కిల్‌లో రోడ్డు పక్కన చిన్న గుడిసెలో నివసిస్తూ ఉండేవారు. రోడ్డు విస్తరణ పేరుతో గుడిసెను మున్సిపల్‌ అధికారులు తొలగించడంతో ఆధారం కోల్పోయి మసీదుపురంలోని బంధువుల అవ్వ ఉంటున్నారు. అధికారుల చుట్టూ తిరిగా రెండేళ్లుగా అవ్వకు పింఛన్‌ మంజూరు కాలేదు.

.. జిల్లాలో ఇలాంటి వారు 18,717 మంది ఉన్నట్లు

అధికారుల లెక్కలు చెబుతున్నాయి.

కర్నూలు(అగ్రికల్చర్‌): ఎన్నికల సమయంలో 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలందరికీ పింఛన్లు ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారాన్ని చేపట్టి రెండేళ్లు పూర్తయినా హామీని అమలు చేయలేదు. కనీసం 60 ఏళ్లు నిండిన వారికి కూడా పింఛన్లు ఇవ్వడం లేదు. లబ్ధిదారులు మరణిస్తే భార్యకు పింఛన్‌ మంజూరు చేయడం మినహా కొత్తవి ఇవ్వడం లేదు. స్పౌజ్‌ పింఛన్లు కూడా 2025 జూలై నుంచి మాత్రమే ఇస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు తర్వాత అంటే 2024 జూన్‌ నుంచి 2026 జూన్‌ వరకు 18,717 మంది పింఛన్‌దారులు మరణించినట్లు లెక్కలు ఉన్నాయి. 2026 జనవరిలో 754, ఫిబ్రవరిలో 761, మార్చిలో 663, ఏప్రిల్‌లో 580, మేలో 713, జూన్‌లో 629 మంది పింఛన్‌దారులు మృతిచెందారు. పింఛన్ల కోసం వృద్ధులు ఎదురు చూడాల్సి వస్తోంది. దివ్యాంగులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చేనేత, మత్స్యకారులు, వివిధ వ్యాధిగ్రస్తుల కష్టాలు అన్నీఇన్నీ కావు. చంద్రబాబు ప్రభుత్వానికి ఈ ఏడాది జూన్‌ 12 నాటికి రెండేళ్లు పూర్తి అయింది. ఆ సమయంలోకొత్త పింఛన్లు ఇస్తున్నామంటూ టీడీపీ నేతలు చేసిన హడావుడి అంతాఇంతా కాదు. కాని కొత్త పింఛన్లు లేనట్లేనని తేలిపోయింది.

నేడు పింఛన్ల పంపిణీ

ఆగస్టు నెల పింఛన్ల పంపిణీ శనివారం జరుగనుంది. ఉదయం 7 గంటల నుంచి పంపిణీ చేసేందుకు డీఆర్‌డీఏ అధికారులు ఏర్పాట్లు చేశారు. కర్నూలు జిల్లాలో జూలై నెలలో 2,34,266 పింఛన్లు ఉండగా.. ఆగస్టు నాటికి 2,33,902కు తగ్గాయి. అంటే 364 పింఛన్లపై వేటు పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement