● డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలి
కర్నూలు(సెంట్రల్): డీఎస్సీ–2024 అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని.. నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో కార్యాలయ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ మాట్లాడుతూ డీఎస్సీ–2024లో పెద్ద ఎత్తున అవకతవకాలు జరిగాయన్నారు. స్పోర్ట్స్ కోటా పేరుతో కొందరు టీడీపీ నాయకులు ఒక్కో టీచర్ ఉద్యోగాన్ని రూ.15 లక్షలకు అమ్ముకున్నారన్నారు. డీఎస్సీ పేపర్ లీకేజీ జరిగిందని.. స్వయంగా పేపర్ తయారు చేసిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి టీచర్ ఉద్యోగం రావడం ఇందుకు నిదర్శనమన్నారు. ఈ అక్రమాలకు మంత్రి లోకేష్ సన్నిహితులే పాల్పడ్డారని, అందులో ఆయనకూ వాటా ఉన్నట్లు తెలుస్తోందన్నారు. నీట్ పేపర్ లీకేజీకి కేంద్ర విద్యాశాఖమంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని, ఏపీలో డీఎస్సీ అక్రమాలకు మంత్రి లోకేష్ బాధ్యత వహించాలన్నారు. కర్నూలు పార్లమెంట్ ఇన్‌చార్జి బుట్టా రేణుక, పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, కోడుమూరు ఇన్‌చార్జి ఆదిమూలపు సతీష్ మాట్లాడుతూ డీఎస్సీ అక్రమాలపై సీఎం చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. తన కుమారుడు మంత్రిగా ఉండటం వల్లే అక్రమాలు జరిగినా విచారణ జరిపించడం లేదన్నారు. రాష్ట్ర అధికార ప్రతినిధి బీవై రామయ, నగర అధ్యక్షుడు అహ్మద్ అలీఖాన్ మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదలలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రతి మంగళవారం అప్పులు చేస్తున్నా ఆ డబ్బు ఎక్కడికి వెళ్తుందో చెప్పడం లేదన్నారు. పెండింగ్ స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ షరీష్, జిల్లా యూత్ వింగ్ అధ్యక్షుడు శివారెడ్డి, విద్యార్థి విభాగం అధ్యక్షుడు ప్రశాంత్, విద్యార్థి విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి గౌతం కటికె, మేధావుల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుమలేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


