కర్నూలు, అనంతపురం, కడప ప్రాంతాలన్నింటికీ అప్పట్లో ఒకటే ల్యాబొరేటరీ. కీలకమైన రక్తపరీక్షలతో పాటు నీరు, ఆహార పరీక్షలు చేయాలన్నా ఇక్కడికే పంపించేవారు. అందరికీ అందుబాటులో ఉంటుందని కర్నూలు మెడికల్ కాలేజ్ ఆవరణలోనే ప్రాంతీయ ప్రయోగశాల ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దాని ఆలనాపాలనా లేక శిథిలావస్థకు చేరుకుంది. ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి. ఇక్కడ పనిచేసే సిబ్బంది భవనం దుస్థితి చూసి బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్నారు.
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు మెడికల్ కాలేజి నుంచి బయటకు వచ్చే ద్వారం వద్ద ప్రాంతీయ ప్రయోగశాల ఉంది. దాదాపు 45 ఏళ్ల క్రితం రాయలసీమ ప్రాంతానికి కర్నూలులో, కోస్తా ప్రాంతానికి గుంటూరులో, ఉత్తర కోస్తాకు విశాఖపట్టణంలో ప్రాంతీయ ప్రయోగశాలలు ఏర్పాటు చేశారు. అప్పట్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో లేని వైద్యపరీక్షలను హైదరాబాద్, చైన్నె, ముంబయి వంటి నగరాలకు పంపించేవారు. అలా గాకుండా ఆ పరీక్షలన్నీ స్థానికంగానే చేయాలన్న ఉద్దేశంతో ప్రాంతీయ ప్రయోగశాలను ఏర్పాటు చేశారు. ఈ ల్యాబ్‌లో మైక్రోబయాలజిస్టు, పెథాలజిస్టు, బయోకెమిస్ట్ వైద్యులతో పాటు పారామెడికల్ ఆఫీసర్/ వాటర్ అనలిస్టు, మరో వాటర్ అనలిస్ట్, మూడు ఫుడ్ అనలిస్ట్ పోస్టులు, ఒక కంప్యూటర్ ఆపరేటర్, రెండు వాచ్‌మెన్, ఒక క్లర్క్, ఒక స్వీపర్, రెండు జేఎస్‌ఓ, నాలుగు మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు, మూడు ల్యాబ్ అటెండెంట్ పోస్టులు, ఒక శ్యాంపిల్ టేకర్, రెండు జూనియర్ అనలిస్టు పోస్టులను క్రియేట్ చేసి మంజూరు చేశారు. ప్రస్తుతం ఇద్దరు, ముగ్గురు సిబ్బంది మాత్రమే ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు.
వరదలతో భవనం శిథిలం
2009 సంవత్సరంలో కర్నూలు నగరాన్ని వరదలు ముంచెత్తాయి. ఆ సమయంలో హంద్రీనీరు కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రితో పాటు కర్నూలు మెడికల్ కాలేజిలోకి వచ్చాయి. కళాశాల ఆవరణలో ఉన్న ప్రాంతీయ ప్రయోగశాలలోకి కూడా వరదనీరు రావడంతో భవనంతో పాటు వైద్యపరికరాలు, పరీక్షల పరికరాలు బాగా దెబ్బతిన్నాయి. ల్యాబ్‌లోని ప్రధాన భవనం మొత్తం దెబ్బతిని అందులోని గోడల్లో చెట్ల వేళ్ల కిందకు దిగాయి. ప్రస్తుతం ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితిలో ఈ భవనం ఉంది. దీంతో పాటు పక్కనున్న కళాశాల మైదానం నుంచి పెద్ద పెద్ద పాములు ఈ భవనంలోకి వచ్చి వెళ్తుండటంతో ఉద్యోగులు హడలిపోతున్నారు. దీంతో ఈ భవనానికి తాళం వేసి ముందుగా ఉన్న రెండు షెడ్లలో పరీక్షలు నిర్వహిస్తున్నారు.
వచ్చిన రూ.19కోట్లు వెనక్కి!
వరదల కారణంగా దెబ్బతిన్న ప్రాంతీయ ప్రయోగశాల ప్రాంతంలో నూతన ప్రయోగశాల నిర్మించాలని గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2024లో రూ.19కోట్లను మంజూరు చేసింది. ఇదే సమయంలో దీనిని స్టేట్ ల్యాబోరేటరీగా కూడా అప్‌గ్రేడ్ చేశారు. అయితే దీనిని కళాశాలలోనే నిర్మించేందుకు స్థానిక అధికారులు ఒప్పుకోకపోవడంతో బయటి ప్రాంతంలో స్థలసేకరణ కోసం చూశారు. రెండేళ్‌లైనా స్థలం చూడలేకపోవడంతో వచ్చిన నిధులు రూ.19 కోట్లు ల్యాప్స్(వెనక్కి వెళ్లిపోయినట్లు) తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం ల్యాబ్ నిర్వహణను ప్రాంతీయ శిక్షణ కేంద్రం(మేల్)లో నిర్వహించాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు సమాచారం. అయితే తమకు ఉన్నతాధికారుల నుంచి ఇక్కడ ల్యాబ్ ఏర్పాటు చేయాలని ఎలాంటి అనుమతులు రాలేదని అక్కడి అధికారులు చెప్పినట్లు తెలిసింది. దీంతో ప్రాంతీయ ప్రయోగశాల పనులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా తయారైంది. కాగా ఇటీవల ఈ ప్రయోగశాల విషయమై జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సృజన అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రయోగశాల నిర్మాణానికి సంబంధించి సమగ్రంగా నోట్‌ఫైల్ తయారు చేసి తనకు ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
మొక్కుబడిగా నీటి పరీక్షలు
ఆహార, వైద్యపరీక్షలు గాలికి
వైద్య సిబ్బంది కొరత
శిథిల భవనంలో ప్రయోగశాల
కూలేందుకు సిద్ధంగా భవనం
2014లో రూ.19కోట్లు మంజూరు
వాడుకోలేక నీరుగారిన వైనం
నామమాత్రంగా పరీక్షలు
వరదల కారణంగా ల్యాబ్ దెబ్బతిన్నప్పటి నుంచి కొన్నాళ్ల పాటు నామమాత్రపు రక్తపరీక్షలు చేశారు. ఐదారేళ్ల నుంచి ఈ పరీక్షలు కూడా చేయకుండా ప్రస్తుతం నీటి పరీక్షలు(వాటర్ అనలిస్టు) మాత్రమే చేస్తున్నారు. ఇక్కడకు ఎవ్వరైనా తెచ్చే నీటిని పరీక్షించడంతో పాటు పండుగలు, పర్వదినాలు, అంటువ్యాధులు ప్రబలిన ప్రాంతాలతో పాటు మున్సిపాల్టీలకు, పంచాయతీలకు ఇక్కడి ఉద్యోగులు వెళ్లి నీటి నమూనాలు తీసుకొచ్చి పరీక్షలు చేస్తున్నారు. కాగా కర్నూలు నగరంలో 60కి పైగా ఆర్‌ఓ వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. దీనికితోడు వసతి గృహాలు, వాణిజ్య కేంద్రాలు, వ్యక్తిగత గృహాల్లో ఏర్పాటు చేసుకున్న ఆర్‌ఓ ప్లాంట్ల నుంచి నీటిని పరీక్షల కోసం తీసుకొస్తున్నారు. తగినంత సిబ్బంది లేక పరీక్షలు చేయలేకపోతున్నారు.


