● ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి
చిప్పగిరి: నీట్ పరీక్ష పేపర్ లీకేజీ కారణంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని, డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలతో అర్హులైన వారికి అన్యాయం జరిగిందన్నారు. అవకతవకలపై సీబీఐతో విచారణ చేయాలని తమ పార్టీ ఎన్ని సార్లు డిమండ్ చేసినా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నాడు– నేడుతో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దిందన్నారు. నేడు స్టూడెంట్ కిట్ కూడా ఇవ్వకుండా విద్యార్థులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు కత్తి రామాంజనేయులు, చంద్రశేఖర్, శ్రీరాములు, వెంకటేష్, మహానంది, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.


