మంత్రాలయం: శ్రీరాఘవేంద్రస్వామి దర్శించుకోవడానికి వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా వచ్చారు. ‘నమో.. రాఘవేంద్రాయా’ అంటూ స్వామి సేవలో తరించారు. అధిక సంఖ్యలో భక్తుల రావడంతో ఆదివారం మూల బృందావన దర్శనానికి నాలుగు గంటలకు పైగా సమయం పట్టింది. కల్పతర క్యూలైన్లు, అన్నపూర్ణ భోజనశాల, పరిమళ ప్రసాదం కౌంటర్లు కిక్కిరిసి కనిపించాయి. మహాద్వారం వరకు క్యూలైన్‌లో భక్తులు నిలబడ్డారు. శ్రీమఠం ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెండు రోప్‌లైన్‌లో వెళ్లి దర్శించుకున్నారు. తుంగభద్ర నదీ తీరంలో భక్తుల కోలాహలం నెలకొంది. ముందుగా గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకున్నారు. అనంతరం మూల బృందవనంను దర్శించుకుని భక్తులు మొక్కులు తీర్చుకున్నారు.


