కర్నూలు(అగ్రికల్చర్): ఏపీఎస్‌పీడీసీఎల్ ప్రధాన కార్యాలయమైన తిరుపతి నుంచి డయల్ యువర్ ఏపీఎస్‌పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమం సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు కర్నూలు సర్కిల్ ఎస్‌ఈ ఆర్.ప్రదీప్‌కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు 8977716661 నంబరుకు ఫోన్ చేయవచ్చని పేర్కొన్నారు. కర్నూలు కొత్తబస్టాండు సమీపంలో ఉన్న విద్యుత్ భవన్‌లో కూడా సోమవారం డయల్ యువర్ ఎస్‌ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. వినియోగదారులు ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు 7382614308 నంబరుకు ఫోన్‌చేసి సమస్యలు పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు.
పీజీఆర్‌ఎస్‌పై క్యూఆర్‌కోడ్
కర్నూలు(సెంట్రల్): ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్)పై అభిప్రాయాన్ని తెలియజేయడానికి ప్రభుత్వ కార్యాలయాల వద్ద క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. పీజీఆర్‌ఎస్‌పై మరింత జవాబుదారీతనాన్ని పెంచేందుకు క్యూఆర్ కోడ్‌ను ప్రవేశపెట్టినట్లు చెప్పారు.
నేడు పీజీఆర్‌ఎస్
కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో సోమవారం ఉదయం 9.30 గంటలకు పీజీఆర్‌ఎస్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. కలెక్టరేట్‌తోపాటు అన్ని మండల, డివిజినల్, మునిసిపల్ కార్యాలయాల్లోనూ ప్రజల నుంచి అర్జీలను అధికారులు స్వీకరిస్తారన్నారు.
వర్షం కోసం
ఎడ్లబండ్లతో ప్రదక్షిణ
నందవరం: వర్షం కోసం నందవరం మండలం కే పేట గ్రామంలో ఆదివారం 52 ఎడ్లబండ్లతో రామప్ప, లచ్చప్ప ఆలయం చుట్టూ రైతులు ప్రదక్షిణలు చేశారు. అనంతరం చిన్నారులు కలశాలతో, భజనలతో పూర్వ వీధుల్లో ఊరేగింపు చేపట్టారు. కే పేట గ్రామం నుంచి 52 జతల ఎడ్లబండ్లతో నాగలదిన్నె మీదుగా గురజాల గ్రామం చేరుకున్నారు. అక్కడ తుంగభద్ర నదిలో పుణ్య స్నానాలు ఆచరించి రామలింగేశ్వర స్వామికి, పార్వతీ దేవికి విశిష్ట పూజలు చేశారు. అనంతరం తుంగభద్ర నది జలాలను తీసుకుని గ్రామానికి చేరుకుని చిన్నారులు కలశాలతో పాటు బ్యాండు మేళాలు, డ్రమ్స్‌లతో ఊరేగింపుగా వెళ్లి గ్రామ దేవతలకు జలాభిషేకాలు నిర్వహించారు. అనంతరం గ్రామస్తులు పిండి వంటలు నైవేద్యాలుగా సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
మహానంది: మహానందిలో కొలువైన శ్రీ కామేశ్వరీదేవి అమ్మవారి ఆలయంలో సోమ వారం శాకంబరీ ఉత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి, వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర్ అవధాని తెలిపారు. శ్రీ కామేశ్వరీదేవి అమ్మవారికి అలంకరణ కోసం వినియోగించే ఆకు, కాయగూరలను ఆదివారం తీసుకొచ్చారు. స్థానిక కల్యాణ మండపంలో మహిళా భక్తులు అలంకరణ కోసం దండలు అల్లే కార్యక్రమం చేపట్టారు. ఈఓ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ఈ ఏడాది వరుసగా మూడు రోజుల పాటు మహానందిలో శాకంబరీ ఉత్సవం ఉంటుందన్నారు.


