ఆదోని: భూకబ్జాలపై ఆధారాలు లేకుండా మాట్లాడితే ఊరుకునేది లేదని మాజీ ఎమ్మెల్యే వై.సాయిప్రసాద్‌రెడ్డి టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయ న తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మండిగిరి గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 344లో గుంతకల్‌వాసి షేక్ సాదిక్‌కు చెందిన3.37 ఎకరాలను తాను కబ్జా చేశానంటూ గుడిసె క్రిష్ణమ్మ నిరాధరమైన ఆరోపణలు చేయడం తగదన్నారు. ఎవరో వచ్చి ఏదో చెబితే నమ్మి వెంటనే మీడియా మందుకు వచ్చి ఆరోపణలు చేయడం బాధ్యతాయుతమైన రాజకీయం కాదన్నారు. అతని వద్ద ఉన్న పత్రాలు, భూమి ఆయనకు ఎలా వచ్చింది, అసలు వివాదం ఏంటి, అమ్మింది ఎవరు, కొనింది ఎవరు? అనే విషయాలను పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాట్లాడాలన్నారు. ‘నేను ఎన్నోసార్లు చెప్పాను.. నాకు, నా కుటుంబానికి కబ్జాలతో సంబంధం లేదు’ అని మరోసారి తెలిపారు. తన పేరు పదే పదే ప్రస్తావిస్తూ రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం రాజకీయ అవివేకమన్నారు. తన పేరును అంతగా గుర్తుంచుకోవాలనుకుంటే రింగ్ టోన్‌గా మార్చుకోవాలన్నారు. భూకబ్జా అంటే ఏమిటో కూడా తెలియకుండా మాట్లాడటం సరికాదని.. తనకు ఎవరి భూమినో దోచుకోవాల్సిన అవసరం లేదన్నారు. తన తాతల కాలం నుంచి భగవంతుడు ఇచ్చిన ఆస్థి ఉందని, అక్రమాలకు పాల్పడాల్సిన పరిస్థితి లేదని స్పష్టం చేశారు. అసలు ఈ రెండేళ్ల కూటమి పాలనలో భూకబ్జాలకు పాల్పడుతోంది మీ పార్టీ నేతలనేనన్నారు. ఇసుక, మద్యం, బియ్యం, అక్రమ రిజిస్ట్రేషన్లు.. అన్నింట్లో దోపిడీ జరుగుతోందన్నారు. ముందుగా వీటిపైన విచారణ చేయించాలని గుడిసె కృష్ణమ్మకు సవాల్ విసిరారు.


