చిప్పగిరి: ఎన్నికల సందర్భంగా ఆలూరు నియోజకవర్గానికి ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని, అలాంటప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఇక్కడికి వచ్చావని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి అన్నారు. శనివారం ముఖ్యమంత్రి ఆస్పరి పర్యటన నేపథ్యంలో పోలీసులు ఆయనను గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గానికి ప్రధాన సాగునీటి వనరైన వేదావతి, నగరడోణ రిజర్వాయర్, జింకల పార్కు, హంద్రీనీవా తూము ఇలా చెప్పుకుంటూపోతే ఆయన ఇచ్చిన హామీలు పెద్ద చిట్టానే ఉందన్నారు. అయితే రెండేళ్లు గడిచినా ఏ ఒక్కటీ నెరవేర్చలేకపోయారన్నారు. తాను ఎమ్మెల్యే అయినప్పటికీ పోలీసులు కనీస ప్రొటోకాల్ పాటించడం లేదన్నారు. నిజంగానే అభివృద్ధి చేసి ఉంటే వైఎస్సార్‌సీపీ నాయకులను చూస్తే అంత భయమెందుకని ప్రశ్నించారు. చంద్రబాబు రెడ్‌బుక్ రాజ్యాంగంలో పోలీసులు పావులుగా మారుతున్నారన్నారు. ఎల్లప్పూడూ కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉండదనే విషయాన్ని పోలీసులు గుర్తుంచుకోవాలన్నారు. ఈ అరాచక పాలనపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు.


