● డీఆర్‌డీఏ పీడీ శ్రీధర్‌రావు
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో స్వయం సహాయక సంఘాల పటిష్టతకు, మహిళల జీవనోపాధులను మరింత మెరుగుపరిచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్‌రావు తెలిపారు. ఇంతవరకు ప్రాజెక్టు డైరెక్టర్‌గా పనిచేసిన వైపీ రమణారెడ్డి నుంచి గురువారం చార్జ్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో స్వయం సహాయక సంఘాలపై పూర్తి అవగాహన ఉందన్నారు. పొదుపు మహిళల జీవనోపాధులను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బాధ్యతలు స్వీకరించడానికి ముందు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరిని మర్యాదపూర్వకంగా కలసి మొక్క అందజేశారు.
గుర్తు తెలియని వ్యక్తి మృతి
బనగానపల్లె: పట్టణంలోని పెట్రోల్‌బంకు సెంటర్‌లోని బస్టాప్ వద్ద గురువారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. సుమారు 60 ఏళ్ల వయస్సు ఉన్న అనాథ మృతదేహాన్ని ప్రయాణికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ దుగ్గిరెడ్డి సమాచారం మేరకు.. మృతుడు నందవరం, యాగంటి పలు పుణ్య క్షేత్రాల్లో యాచిస్తూ జీవించే వాడని, గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందినట్లు తెలిపారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి మృతదేహాన్ని తరలించి, గుర్తు తెలియని వ్యక్తి మృతిగా కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
నలుగురు పిల్లలతో మహిళ అదృశ్యం
పెద్దకడబూరు: తన నలుగురు పిల్లలతో సహా మహాలక్ష్మి అనే మహిళ అదృశ్యమయ్యారని ఎస్‌ఐ మారుతి తెలిపారు. చిన్నతుంబళం గ్రామానికి చెందిన మహాలక్ష్మి(30)తో కల్లుకుంట గ్రామానికి తిక్కన్నకు వివాహమైందని, వీరికి ముగ్గురు కుమారులు, ఒక కూమార్తె ఉన్నారని చెప్పారు. భర్తతో గొడవపడి మూడురోజుల క్రితం పిల్లలతో సహా మహాలక్ష్మి ఎక్కడికో వెళ్లిపోయారని గురువారం ఆమె తమ్ముడు రాజు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మహిళ ఆచూకీ తెలిసిన వారు 9121101156 నంబర్‌కు సమాచారం అందించాలని తెలిపారు.
గూడూరులో చైన్‌స్నాచింగ్
కోడుమూరు రూరల్: ఇంటి ముందు పనిచేసుకుంటున్న మహిళ మెడలోని బంగారు చైన్‌ను దుండగుడు అపహరించాడ. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున గూడూరులోని గోట్లవీధిలో చోటు చేసుకుంది. పద్మావతి అనే మహిళ ఇంటి ముందు కసువు కొడుతుండగా ఓ దుండగుడు అక్కడికి చేరుకున్నాడు. ఆమె మెడలోని మూడున్నర తులాల బంగారు చైన్‌ను లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు. మహిళ ప్రతిఘటించడంతో ఆ దుండగుడు ఆమెను కిందకు తోసి బలవంతంగా చైన్‌ను తెంపుకొని వెళ్లాడు. ఈ దృశ్యాలన్నీ అక్కడే ఉన్న మసీదులోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సీసీ ఫుటేజీ ఆధారంగా గూడూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా గూడూరులో ఇటీవల వరుసగా చైన్ స్నాచింగ్‌లు చోటు చేసుకుంటుండడంతో మహిళలు ఒంటరిగా వీధుల్లోకి రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి దాపురించింది.
లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం
గోనెగండ్ల: రోడ్డు ప్రమాదంలో ఒంటెడుదిన్నె గ్రామానికి చెందిన తమ్మల పుల్లయ్య(52) అనే వ్యక్తి మృతిచెందాడు. గోనెగండ్ల ఎస్‌బీఐ బ్యాంకు దగ్గర రహదారిలో గురువారం సాయంత్రం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతుని బంధువులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఒంటెడుదిన్నె గ్రామానికి చెందిన పుల్లయ్యకు భార్య లక్ష్మి, కూతురు ఉన్నారు. అయితే పుల్లయ్య గోనెగండ్లలో మద్యం తాగి ఎస్‌బీఐ బ్యాంకు దగ్గర రోడ్డు దాటుతుండగా కర్నూలు నుంచి ఎమ్మిగనూరుకు వెళ్తున్న లారీ ఢీకొంది. దీంతో పుల్లయ్య లారీ కింద పడ్డాడు. పుల్లయ్య తల నుజ్జు నుజ్జు అయ్యి దుర్మరణం చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారించారు. పుల్లయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


