ఆదోని అర్బన్: పట్టణంలోని ఎమ్మిగనూరు ప్రధాన రహదారిలోని యూనియన్ బ్యాంకు వద్ద గురువారం రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. పంట రుణాలు తీసుకున్న రైతులకు ఈనెల 31వ తేదీ వరకు పంట బీమా చేసుకునే అవకాశం ఉందని అధికారులు ముందుగా తెలిపారు. కానీ అర్ధంతరంగా గడువు ముగిసిపోయిందని బ్యాంకు అధికారులు చెప్పడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ రైతులు బ్యాంకు ఎదుట రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. అధికారులు ముందుగా ఇచ్చిన హామీ ప్రకారం గడువును పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రైతులకు బీమా సౌకర్యం కల్పించాలి
కోసిగి: బ్యాంక్‌లో రుణాలు తీసుకున్న రైతులకు బీమా పొందే సౌకర్యం కల్పించాలని ఆంధ్ర ప్రదేశ్ రైతు సంఘం మండల నాయకులు రాముడు, ప్రకాష్, వీరేష్ డిమాండ్ చేశారు. గురువారం కోసిగి ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ఎదుట రైతులతో కలిసి రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. వారు మాట్లాడుతూ.. మండలంలో అత్యధికంగా పత్తి పంటలు సాగు చేసుకున్నారని, అయితే బ్యాంక్‌లో మిర్చి పంట పేరుతో రుణం నమోదు చేయబడిందన్నారు. వాస్తవ పంట నమోదు చేసి బీమా అవకాశం కల్పించాలని కోరారు. అనంతరం బ్యాంక్ మేనేజర్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు మహాదేవా, హనుమంతు, కోసిగయ్య పాల్గొన్నారు.


