కర్నూలు(అర్బన్): సమాజానికి మహాత్మా జ్యోతిరావు పూలే అందించిన సేవలు చిరస్మరణీయమని, విద్యతోనే సమాజంలో మార్పు సాధ్యమని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. శనివారం మహాత్మా జ్యోతిరావు ఫూలే 200వ జయంతి సందర్భంగా స్థానిక బిర్లా సర్కిల్‌లోని పూలే దంపతుల విగ్రహాలకు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్‌ఖమర్‌తో కలిసి ఎంపీ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్థానిక సంక్షేమ భవన్ ఎదురుగా జిల్లా బీసీ సంక్షేమ సాధికారత అధికారిణి కె.ప్రసూన అధ్యక్షతన ఏర్పాటు సభకు పెద్ద సంఖ్యలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ప్రజా సంఘాల నేతలు హాజరై ఫూలేకు ఘనంగా నివాళులర్పించారు. జేసీ నూరుల్ ఖమర్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు ఫూలే చిన్న వయస్సులోనే వివాహం చేసుకున్నప్పటికి తన సతీమణి సావిత్రీబాయి ఫూలేకు చదువు నేర్పించి, ఆమె ద్వారా సమాజంలోని మహిళలకు విద్యను అందించే కార్యక్రమాలు చేపట్టారన్నారు. బాల్య వివాహాలు, కుల వివక్షత వంటి సామాజిక సమస్యలపై ఆయన చేసిన పోరాటాలు ఈ తరానికి ఆదర్శంగా నిలుస్తాయన్నారు. ఈ సందర్భంగా మహాత్మా జీవిత చరిత్రపై పలు బీసీ సంక్షేమ బాలికల వసతి గృహాలకు చెందిన విద్యార్థినీలు చేసిన నృత రూపకాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ ఈడీ జాకీర్‌హుసేన్, బీసీ వసతి గృహ సంక్షేమాధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు పాలెగార్ సత్యనారాయణరాజు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాసులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు, ఎస్సీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోన నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
మహనీయుడు ఫూలే
సమాజంలోని అట్టడుగు వర్గాల కోసం అనేక ఉద్యమాలు, త్యాగాలు చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని వైఎస్సార్‌సీపీ కర్నూలు, నంద్యాల జిల్లాల అధ్యక్షులు ఎస్వీ మోహన్‌రెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. శనివారం జ్యోతిరావు ఫూలే 200వ జయంతి సందర్భంగా స్థానిక బిర్లాగేట్ సర్కిల్‌లోని ఫూలే దంపతుల విగ్రహాలకు వారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పూలే ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం అనే విలువలకు వైఎస్సార్‌సీపీ కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నేతలు అక్కిమి హనుమంతరెడ్డి, మాజీ జెడ్పీటీసీ సుంకన్న, గడ్డం రామకృష్ణ, సిట్రా సత్యనారాయణమ్మ, బెస్త శ్రీనివాసులు, భారతి, రాఘవేంధ్ర పాల్గొన్నారు.
ఎమ్మెల్యేల గైర్హాజరు పట్ల ఆగ్రహం
జిల్లాలో మంత్రితో పాటు ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నా, ఒక్కరు కూడా మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి కార్యక్రమానికి హాజరు కాకపోవడం పట్ల బీసీ సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ప్రజల ఓట్లు మాత్రమే వీరికి కావాలి తప్ప, ఆయా వర్గాలకు చెందిన మహానేతల జయంతి ఉత్సవాలకు హాజరయ్యేందుకు కూడా వీరికి తీరిక లేదని మండిపడ్డారు.


