● స్వర్ణ గ్రామాలుగా గ్రామ సచివాలయాలు
చిప్పగిరి: పేర్లు మార్చవచ్చు కానీ, కట్టిన భవనాలను మార్చలేరనే విషయాన్ని టీడీపీ ప్రభుత్వం విస్మరిస్తోంది. ప్రజలకు పాలన చేరువ చేయాలనే ఉద్దేశంతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గ్రామాల్లోనే లక్షలాది రూపాయలు వెచ్చించి సచివాలయ వ్యవస్థకు కొత్త రూపు తీసుకొచ్చింది. మండల కార్యాలయాలకు వెళ్లే అవసరం లేకుండా స్థానికంగానే ఉద్యోగులను నియమించి సేవలు ఇంటి తలుపు తట్టేలా పాలన సాగించింది. రెండేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం పాలనలో కొత్తదనం చూపడం పక్కనపెడితే.. క్రెడిట్ చోరీకి పాల్పడుతోంది. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి గత ప్రభుత్వంలో నిర్మించిన గ్రామ సచివాలయాలకు పేరు మార్పుతో ప్రజల్లో నవ్వుల పాలయ్యేందుకు సిద్ధమైంది. స్వర్ణ గ్రామాలుగా పేరు మార్చిన టీడీపీ ప్రభుత్వం ఆ మేరకు గ్రామ సచివాలయాల పేర్లు మార్చే దిశగా చర్యలు చేపట్టడం విమర్శలకు తా విస్తోంది. కొత్తగా నిర్మాణాలు చేపట్టి పేర్లు మార్చుకుంటే బాగుంటుంది కానీ, ఎవరో కట్టించిన నిర్మాణాలకు వీళ్లు పేర్లు మార్చుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.


