● అడ్డదారి తొక్కిన విద్యార్థులు
● 8 మంది యువకులను
అరెస్ట్ చేసిన పోలీసులు
● మొత్తం 3.1 కేజీల గంజాయి స్వాధీనం
కర్నూలు: బాగా చదువుకుని, మంచి ఉద్యోగం సంపాదించి కుటుంబ సభ్యులకు అండగా ఉండాల్సిన కొందరు విద్యార్థులు దారి తప్పారు. తొలుత గంజాయి తాగేందుకు అలవాటు పడ్డారు. స్నేహితుల సలహా మేరకు గంజాయి రవాణాను ఆదాయ వనరుగా మార్చుకుని పోలీసులకు అడ్డంగా దొరికి కటకటాలపాలయ్యారు. కర్నూలు శివారులోని వీకర్ సెక్షన్ కాలనీ వాటర్ ట్యాంకు దగ్గర జోరుగా గంజాయి వ్యాపారం సాగుతోందని పోలీసులకు సమాచారం అందింది. నాలుగో పట్టణ సీఐ విక్రమసింహ ఆధ్వర్యంలో పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి శనివారం దాడులు నిర్వహించారు. గంజాయి విక్రయా లు సాగిస్తున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి పొట్లాల రూపంలో ఉన్న 3.1 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.
నాలుగు నెలలుగా వ్యాపారం..
నందికొట్కూరు హాజీ నగర్‌కు చెందిన షేక్ అక్బర్ బాషా ప్రస్తుతం కల్లూరు చెన్నమ్మ సర్కిల్‌లో ఉంటూ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. కర్నూలు పాతబస్తీలోని ఛత్రీబాగ్‌లో నివాసముంటున్న తెలుగు సాయి, బంగారుపేటకు చెందిన షికారి చరణ్, వాల్మీకి శ్రీనివాసులు, మునగాలపాడుకు చెందిన మల్లెపోగు జయసింహ, కర్నూలు అరోరా నగర్‌కు చెందిన తమ్మిడిపల్లి పెద్దరంగస్వామి, శ్రీరాం నగర్‌కు చెందిన తొగరి మౌలి కిషోర్, బండారి శాంతివర్ధన్ జట్టుగా ఏర్పడి కొంతకాలంగా వీకర్ సెక్షన్ కాలనీని అడ్డాగా చేసుకుని గంజాయి వ్యాపారాన్ని సాగిస్తున్నారు. ఒడిశాకు చెందిన ప్రవీణ్ పగాడియా రంజిత్‌తో పరిచయం పెంచుకుని కిలో రూ.2 వేల చొప్పున కొనుగోలు చేసి దానిని 100 గ్రాములుగా పొట్లాలు కట్టి రూ.400 నుంచి రూ.500కు విక్రయాలు జరిపి సొమ్ము చేసుకుంటున్నారు. మొదట అక్బర్ బాషా, తెలుగు సాయి, షికారి చరణ్ ఈ వ్యాపారం సాగించారు. మిగిలినవారు మొదట తాగేందుకు అలవాటు పడి ఆ తర్వాత అక్బర్ బాషా నుంచి కిలోల కొద్దీ గంజాయి కొనుగోలు చేసి మిగిలినవారు కూడా వ్యాపారులుగా మారారు.
చదువుకుంటూనే..
మునగాలపాడుకు చెందిన మల్లెపోగు జయసింహ ఐటీఐ చదువుతున్నాడు. అలాగే కర్నూలు శ్రీరాం నగర్‌కు చెందిన బండారి శాంతివర్ధన్ ఐటీఐ పూర్తి చేసి ప్రస్తుతం హైదరాబాదులో ఎయిర్ హోస్ట్ శిక్షణ పొందుతున్నాడు. కర్నూలు అరోరా నగర్‌కు చెందిన తమ్మిడిపల్లె పెద్దరంగస్వామి ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చదువుతూ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వీరంతా మొదట గంజాయి మత్తుకు అలవాటు పడి ఆ తర్వాత వ్యాపారులుగా మారి పోలీసుల నిఘాకు అడ్డంగా దొరికి కట కటాలపాల య్యారు. అరకు, ఒడిశా నుంచి బస్సు, రైలు మార్గం గుండా కర్నూలుకు గంజాయి రవాణా అవుతున్నట్లు వారు విచారణలో అంగీకరించారు. కల్లూరు తహసీల్దార్ ఆంజనేయులు, ఆర్‌ఐ శ్రీనివాస రెడ్డి, వీఆర్వో సతీష్‌ల సమక్షంలో పంచనామా నిర్వహించి నిందితులను కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశించినట్లు సీఐ తెలిపారు.


