పంచాయతీ కార్యదర్శులు ‘శత’మతం | - | Sakshi
Sakshi News home page

పంచాయతీ కార్యదర్శులు ‘శత’మతం

Feb 12 2026 7:39 AM | Updated on Feb 12 2026 7:39 AM

పంచాయతీ కార్యదర్శులు ‘శత’మతం

పంచాయతీ కార్యదర్శులు ‘శత’మతం

కృష్ణగిరి: ఎన్నికల ముందు తాము గద్దెనెక్కితే సంపద సృష్టిస్తామని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు అధికారం చేపట్టి రెండేళ్లు కావస్తున్నా ఆ ఊసేలేదు. సంపదకు బదులు అప్పులు సృష్టిస్తున్నారు. ప్రస్తుతం ఈ అప్పులు కూడా పుట్టడం కష్టమవ్వడంతో అడ్డదారులు వెతుకుతున్నారు. ఇప్పటికే మద్యం, విద్యుత్‌ సర్‌ చార్జీలు తదితరవి పెంచడం ద్వారా కోట్లలో ఆదాయం గడించిన బాబు సర్కారు ఇప్పుడు పన్నుల వసూళ్లపై దృష్టి సారించింది. ప్రజల ముక్కుపిండి వందశాతం పన్నులు వసూలు చేయాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని పంచాయతీ కార్యదర్శులకు హుకుం జారీ చేసింది. ఈ పరిణామం వారిలో ఆందోళన కలిగిస్తోంది. స్వర్ణాంధ్ర, స్వచ్ఛ ఆంధ్రా అంటూ పేర్లు పెట్టడం తప్ప కింది స్థాయి ఉద్యోగుల బాధలు పాలకులకు పట్టడం లేదని పలువురు గ్రామ కార్యదర్శులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.

రెండు నెలల ముందే ఇంటి పన్ను వసూళ్లు

ప్రతి ఏడాది ఇంటిపన్ను వసూళ్లకు మార్చి నెలలో నోటీసులు జారీ చేసి ఆ నెలాఖరుకుగానీ, ఏప్రిల్‌ చివరకుగానీ పంచాయతీ కార్యదర్శులు వసూలు చేస్తుంటారు. కానీ ప్రస్తుత సర్కారు మరెక్కడా అప్పు పుట్టక తమపై పడిదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ మెడపై కత్తి పెట్టి పన్నులు వసూలు చేయాలని చెప్పడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ నెల 14లోగా వందశాతం పన్నులు వసూలు చేయని వారిని సస్పెండ్‌ చేస్తామంటూ బెదిరింపులకు దిగడం ఎంతవరకూ సబబు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ఫ్యాక్టరీలు, పెద్ద పెద్ద గోడౌల యజమాన్యాలు మార్చి నెలాఖరులో తమ పద్దులు సరి చూసుకుని పన్ను కడుతుంటారు. కానీ, ప్రభుత్వం ఉన్నతాధికారుల ద్వారా ఒత్తిడి పెంచడంతో వయసు పైబడిన సీనియర్‌ కార్యదర్శులు బీపీలు, షుగర్లు పెంచుకుని ఆనారోగ్యం పాలవుతున్నారు. మరి కొందరైతే సెలవు ఇస్తే వెళ్లిపోదామన్న రీతితో ఇతర దారులు వెతుకున్నారు. అధికారంలోకి వస్తే ఉద్యోగులకు అది చేస్తాం.. ఇది చేస్తామని ఆశలు పెట్టి చివరకు ఇబ్బందులకు గురిచేస్తుందని కూటమిసర్కారుపై పలువురు పంచాయతీ కార్యదర్శులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ లక్ష్యం..

కర్నూలు జిల్లాలోని 25 మండలాల్లో 3,56,885 గృహాలు ఉన్నాయి. జిల్లాలో నాన్‌ట్యాక్సీ, ట్యాక్సీ కింద పన్ను లక్ష్యం రూ. 50 కోట్లు కాగా ఇప్పటి వరకు 50శాతం దాకా వసూలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అలాగే కృష్ణగిరి మండలంలోని 16 గ్రామ పంచాయతీల్లో 10,121 గృహాలు ఉన్నాయి. ఇక్కడ పన్ను లక్ష్యం రూ. 24,38,000లు కాగా ఇప్పటి వరకు 50శాతం వసూలు చేశారు. మిగిలిన 50 శాతం మూడు రోజుల్లోగా చేయకపోతే వేటు తప్పదనే ఆందోళన మరో వైపు వారిని కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

రాత్రిళ్లు గ్రామాల్లోనే బస చేసి..

పన్ను వసూళ్లపై ప్రభుత్వం, ఉన్నతాధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో జిల్లాలోని చాలా గ్రామ పంచాయతీల్లో కార్యదర్శులు రాత్రి పూట కూడా విధులు నిర్వహిస్తున్నారు. రాత్రి 9 గంటల వరకు ఇంటింటా తిరుగుతూ ఇంటి, కుళాయి పన్నులు కట్టాలని వేడుకుంటున్నారు. ప్రభుత్వం పెడుతున్న ఒత్తిడిని తట్టుకోలేక పంచాయతీ కార్యదర్శుల్లో ఎవరికై నా ఏమైనా జరిగితే వారి కుటుంబాలకు అండగా ఉండేదెవరని ప్రశ్నిస్తున్నారు.

14లోగా వందశాతం ఇంటి పన్నులు

వసూలు చేయాలని

ప్రభుత్వం ఆదేశాలు

లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరికలు

ఆందోళనలో కార్యదర్శులు

ఒత్తిడి వల్ల తమకు ఏమైనా జరిగితే

బాధ్యత ఎవరిదని ఆవేదన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement