సాయుధ దళాల ఫ్లాగ్‌డే నిధికి విరాళాలు ఇవ్వండి
● జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి
కర్నూలు(అర్బన్): సాయుధ దళాల ఫ్లాగ్‌డే నిధికి అధికారులు విరాళాలు అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి పిలుపునిచ్చారు. సాయుధ దళాల ఫ్లాగ్‌డే నిధికి జిల్లా పంచాయతీ అధికారి జీ భాస్కర్ తమ శాఖ పరిధిలోని ఇద్దరు డీఎల్‌పీఓలు, 25 మంది ఎంపీడీఓల ద్వారా సేకరించిన రూ.60 వేల చెక్కును సోమవారం జిల్లా కలెక్టర్‌కు అందించారు. స్థానిక సునయన ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ.. దేశ సరిహద్దులను కాపాడుతూ నిరంతరం సేవలందిస్తున్న సాయుధ దళాల సిబ్బంది, వీర మరణం పొందిన సైనికుల కుటుంబాలు, మాజీ సైనికుల సంక్షేమానికి ఫ్లాగ్‌డే నిధులను అందించడం మన బాధ్యతగా స్వీకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైనిక సంక్షేమ అధికారి రత్నరూత్, డిప్యూటీ ఎంపీడీఓలు జేమ్స్ కృపవరం, నగేష్ పాల్గొన్నారు.
త్వరలో వినూత్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు
మహానంది: వినూత్నమైన కథతో త్వరలో ప్రేక్షకుల మందుకు వస్తున్నట్లు ప్రముఖ సినీ దర్శకుడు తేజ అన్నారు. మహానందీశ్వరుడి దర్శనానికి సోమవారం మహానందికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన శ్రీ కామేశ్వరీదేవి, శ్రీ మహానందీశ్వరస్వామి వార్లను దర్శించుకుని అభిషేకం, కుంకుమార్చన పూజలు చేపట్టారు. దర్శనం అనంతరం ఆలయ సూపరింటెండెంట్ అంబటి శశిధర్‌రెడ్డి, ఆలయ అర్చకులు దర్శకుడు తేజకు స్వామి, అమ్మవారి ప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మంచి చిత్రాలకు ఎప్పుడూ ప్రేక్షకుల్లో ఆదరణ ఉంటుందన్నారు. ఆయన వెంట బొల్లవరం ప్రసాద్, మిత్రులు పాల్గొన్నారు. పలువురు అభిమానులు ఫొటోలు తీసుకున్నారు.
భార్యాభర్తల బలవన్మరణం
మద్దికెర: మనస్పర్ధలతో పెరవలి గ్రామానికి చెందిన లాల్ శేఖర్ (32), అనూషా (25) దంపతులు సోమవారం వేర్వేరుగా ఆత్మహత్య చేసుకున్నారు. జీవనోపాధి కోసం చాలా ఏళ్ల క్రితం వీరు సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్ మునిసిపాలిటీ పరిధిలో ఐలాపూర్ చిన్న తండాకు వెళ్లారు. అక్కడ ధోబీ పని చేస్తూ జీవనం సాగించేవారు. భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా అనూషా అదే గ్రామంలో ఉన్న పుట్టింటికి ఆదివారం వెళ్లింది. తల్లి ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న లాల్ శేఖర్ మనస్తాపంతో తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతులకు కొడుకు, కూతురు ఉన్నారు. అమీన్పూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
సాయుధ దళాల ఫ్లాగ్‌డే నిధికి విరాళాలు ఇవ్వండి


