మంచు మాటున కాటేసిన మృత్యువు
● పొగ మంచు కారణంగా రహదారిపై
కనిపించని వాహనాలు
● ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన ఆటో
● ఇద్దరు దుర్మరణం
ప్యాపిలి: పొగ మంచు మాటున దాగిన మృత్యువు ఇద్దరిని మింగేసింది. ఎన్. రంగాపురం సమీపంలో మంగళవారం ద్విచక్రవాహనాన్ని ఆటో ఢీ కొన్న ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఎన్ రంగాపురం గ్రామానికి చెందిన ఎలుకపెంట్ల రాజశేఖర్ (24), కొప్పుల సురేంద్ర (26) డోన్ సమీపంలోని ఉడుములపాడు వద్ద ఓ కెమికల్ ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డులుగా పని చేస్తున్నారు. విధినిర్వహణకు వారు ప్రతి రోజూ బైక్‌పై ఫ్యాక్టరీకి వెళ్లివచ్చేవారు. రోజు లాగే మంగళవారం వేకువజామునే దిచక్రవాహనంపై ఉడుములపాడుకు బయలుదేరారు. అయితే కొద్ది దూరం ప్రయాణించగానే ఎదురుగా ప్యాపిలి వైపు వస్తున్న ఆటో.. ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. దట్టంగా కమ్ము కున్న పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్న బైక్ కనిపించకపోవడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రాజశేఖర్, సురేంద్ర అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు సురేంద్రకు భార్య కల్యాణి, ఏడాది వయస్సుగల కుమారుడు ఉండగా ప్రస్తుతం ఆమె మూడు నెలల గర్భిణి. మృతుడు రాజశేఖర్ తండ్రి రాముడు కొద్ది సంవత్సరాల క్రితం గుండెపోటుతో మృతి చెందగా.. కెమికల్ ఫ్యాక్టరీలో పని చేస్తూ తల్లి మాధవిని పోషించుకుంటున్నాడు. ఆయా కుటుంబాలకు పెద్ద దిక్కుగా ఉన్న ఇద్దరు మృతి చెందడంతో బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు రోదిస్తున్న తీరు స్థానికులను కలచివేసింది. కాగా ఇదే ప్రమాదంలో ఆటోలో ఉన్న మరో యువకుడు తలారి సురేంద్రకు గాయాలు కాగా చికిత్స నిమిత్తం డోన్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


