డిపార్టుమెంటల్ పరీక్ష కేంద్రం తనిఖీ
కర్నూలు(సెంట్రల్): దూపాడులోని అయాన్ డిజిటల్ ఎగ్జామినేషన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన డిపార్టుమెంటల్ పరీక్ష కేంద్రాన్ని డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉద్యోగులకు సంబంధించి వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు ఈనెల 5 నుంచి 10వ తేదీ వరకు డిపార్టుమెంటల్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రాన్ని సందర్శించిన ఆమె అభ్యర్థులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. పరీక్షలకు సంబంధించి అన్ని రకాల భద్రత చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఆర్‌పీఎస్‌ఐల పదోన్నతికి ప్రతిపాదనలు
కర్నూలు: పోలీసు శాఖ నాలుగో జోన్ పరిధిలోని వివిధ పోలీస్‌స్టేషన్లలో పనిచేస్తున్న 15 మంది హెడ్ కానిస్టేబుళ్లు, ఏఎస్‌ఐలకు ర్యాంక్ ప్రమోటీ ఎస్‌ఐలుగా (ఆర్‌పీఎస్‌ఐ) పదోన్నతి కల్పించేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఈ మేరకు కర్నూలు రేంజ్ డీఐజీ కార్యాలయం నుంచి మంగళవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇందులో భాగంగా కర్నూలు జిల్లాలో ఒకరికి, నంద్యాల జిల్లాలో ఒకరికి, అనంతపురం జిల్లాలో ముగ్గురికి, అన్నమయ్య, సత్యసాయి జిల్లాలో ఒక్కొక్కరికి, వైఎస్సార్ కడప జిల్లాలో 8 మందికి ర్యాంక్ ప్రమోటీ ఎస్‌ఐలుగా పదోన్నతి కల్పించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి వారిపై ఉన్న ఫిర్యా దులు, ఇతరత్రా విషయాలపై నివేదికలు పంపాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.
జంట హత్యల కేసులో 20 మందిపై కేసు
ఎమ్మిగనూరు రూరల్: మండల పరిధిలోని కందనాతి గ్రామంలో సోమవారం జరిగిన జంట హత్యల కేసులో 20 మందిపై కేసు నమోదు చేసినట్లు రూరల్ సీఐ చిరంజీవి తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గ్రామానికి చెందిన బోయ వెంకటేష్, బోయ పరమేష్‌లను ప్రత్యర్థులు దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందేనన్నారు. పరమేష్ భార్య జయలక్ష్మి ఫిర్యాదు మేరకు సీతారాముడు, శంకర్, రాముడు, వెంకీ, ధర్మా, సుమ, కేశవ, బిక్కిదుబ్బ నరసింహుడు, బిక్కి శంకర్, అద్దాల హరీష్, విష్ణు, వెంకటేష్, కొండయ్య కుమారుడు కేశవ్, మహేంద్ర, హరిబాబు, అశోక్, నరసింహుడు, మల్లేష్, అంజినప్ప, మారెన్నలపై కేసు నమోదు చేశామని తెలిపారు. ఇదిలాఉంటే పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను రూరల్ ఎస్‌ఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో అంబులెన్స్‌లో గ్రామానికి తీసుకొచ్చారు. మంగళవారం మధ్యాహ్నం పోలీసు బందోబస్తు మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. గ్రామంలో పరిస్థితిని డీఎస్పీ ఎంఎన్. భార్గవి, రూరల్ సీఐ చిరంజీవి పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.
జిల్లా అంతటా విజిబుల్ పోలీసింగ్
కర్నూలు: ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు జిల్లా అంతటా విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. ముందస్తు తనిఖీలతో పాటు రహదారి భద్రతపై కూడా వాహనదారులకు అవగాహన కల్పించారు. అనుమానాస్పద వాహనాలు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. నిషేధిత వస్తువులు, గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించి తనిఖీలు చేపట్టారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, డ్రైవర్లు సీటు బెల్టు పెట్టుకోవాలని వాహనదారులకు సూచించా రు. ముఖ్యంగా సెల్‌ఫోన్ డ్రైవింగ్, డ్రంకెన్ డ్రైవ్ వంటి ప్రమాదకర చర్యలకు పాల్పడిన వారిని తీవ్రంగా మందలించి కేసులు నమోదు చేశారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుని వెళ్తున్న ఆటోలను ఆపి కేసులను నమోదు చేశారు. ప్రజల భద్రతకు సంబంధించిన ఏవైనా సమస్యలు ఎదుర్కొంటే స్థానిక పోలీసులు, డయల్ 112, 100కు సమాచారమివ్వాలని తనిఖీల సందర్భంగా పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించారు.
డిపార్టుమెంటల్ పరీక్ష కేంద్రం తనిఖీ


