టీడీపీ నాయకుల దౌర్జన్యంతో మా పొలాలు బీళ్లుగా మారాయి
కోర్టు ఆదేశాలున్నా లెక్కచేయడం లేదు
వెల్దుర్తి: గ్రామ టీడీపీ నాయకుల దౌర్జన్యంతో దాదాపు 250 ఎకరాల పంట పొలాలు రెండేళ్లుగా బీళ్లుగా మారాయని, తీవ్ర ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటున్నామని, జీవనోపాధి కోల్పోయి దుర్భర జీవనం గడుపుతున్నామని వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లె గ్రామ రైతులైన వైఎస్సార్సీపీ నాయకులు తమ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి విన్నవించారు. పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవితో కలిసి వారు బుధవారం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో మాజీ సీఎంను కలిశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, గ్రామ నాయకులు బొమ్మిరెడ్డిపల్లెలో నెలకొన్న తీవ్రమైన పరిస్థితులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. 19 నెలలుగా పొలాల్లోకి వెళితే చాలు గ్రామ టీడీపీ నాయకులు, కార్యకర్తలు వ్యవసాయం చేయకుండా అడ్డుకుంటూ, తీవ్ర భయాందోళనలు సృష్టిస్తున్నారన్నారు. ఉద్దేశపూర్వకంగా తమపై కక్ష గట్టి పొలాలు బీళ్లు చేశారన్నారు. ఏకంగా పార్టీ సానుభూతి పరుల గడ్డి వాములు తగలబెడుతూ రాక్షసానందం పొందుతున్నారన్నారు. గ్రామంలోకి వెళ్లేలా, ప్రజాస్వామ్య బద్ధంగా ఉండేలా కోర్టు ఆదేశాలున్నా భయభ్రాంతులు సృష్టించి మరీ పంటలు వేయకుండా అడ్డుకుంటున్నారని వాపోయారు. ఈ సందర్భంగా మాజీ సీఎం స్పందిస్తూ అన్నివిధాల అండగా ఉంటామని బాధితులకు భరోసా కల్పించారు. మాజీ సీఎంను కలిసిన వారిలో బొమ్మిరెడ్డిపల్లె గ్రామ నాయకులు మధుసూధన్ రెడ్డి, చక్రపాణిరెడ్డి, ఆనంద పద్మనాభ రెడ్డి, భాస్కర్ రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, రంగయ్య చౌదరి, జగదీశ్వరరెడ్డి, సూర్యనారాయణ చౌదరి, వెంకటేశ్ చౌదరి, సంజీవరెడ్డి, భాస్కర్ నాయుడు ఉన్నారు.
అధికార దుర్వినియోగంతో గ్రామంలో
అప్రజాస్వామిక పరిస్థితులు
పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవితో
కలిసి మాజీ సీఎం
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని కలిసిన
బొమ్మిరెడ్డిపల్లె గ్రామ వైఎస్సార్సీపీ నాయకులు


