పంట నమోదుపై ఎస్‌ఎంఎస్ సమాచారం
కర్నూలు(అగ్రికల్చర్): ఈ–పంట సమాచారం ఎస్‌ఎంఎస్ రూపంలో రైతుల ఆధార్ లింక్ మొబైల్‌కు సమాచారం వస్తుందని జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇకపై రైతులు ఈ–పంట వివరాలను ఆన్‌లైన్‌లో స్వయంగా ధృవీకరించుకునే అవకాశం ఉందన్నారు. ఏవైనా తప్పులు ఉంటే ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయవచ్చన్నారు. www.karshak.ap.gov.in/ecrop, www.agricluture.ap.gov.in వెబ్‌సైట్‌ల ద్వారా పంటల నమోదు వివరాలను చెక్ చేసుకోవచ్చన్నారు.
సంక్రాంతికి ఊరెళ్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త
కర్నూలు: సంక్రాంతి పండుగ సెలవుల్లో ఇళ్లకు తాళాలు వేసి ఎక్కువ రోజులు బయటకు వెళ్లేవారు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని డీఐజీ/ఇన్‌చార్జి ఎస్పీ విక్రాంత్ పాటిల్ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పండుగ వేళ చాలామంది కుటుంబ సమేతంగా ఊళ్లకు వెళ్తుంటారని, ఇదే అదునుగా దొంగలు చోరీలు పాల్పడే అవకాశం ఉందని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. పండుగకు ఊరెళ్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టవద్దని సూచించారు. ఇంట్లో ఎవరూ లేరని తెలియకుండా ఉండేందుకు రాత్రివేళ లైట్లు వెలిగేలా ఏర్పాటు చేసుకోవాలన్నారు. అపార్ట్‌మెంట్ల కాలనీ వాసులు సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే భద్రత ఉంటుందన్నారు. ప్రయాణాల్లో గుర్తు తెలియని వ్యక్తులు ఇచ్చే ఆహారం, పానీయాలను తిరస్కరించాలన్నారు. అనుమానితులు కనిపిస్తే 112 కానీ, డయల్ 100కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.


