పత్తి కొనుగోళ్లలో టీడీపీ నేతల పెత్తనం
కర్నూలు(అగ్రికల్చర్): ఎంతో కష్టపడి పండించిన పంటను రైతులు అమ్ముకుందామనుకున్నా అధికార పార్టీ నేతలు అడ్డొస్తున్నారు. పత్తి కొనుగోలు కేంద్రాల వద్ద టీడీపీ నేతల హవా నడుస్తోంది. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆదోనిలో 10, ఎమ్మిగనూరులో 4, గూడూరు మండలం పెంచికలపాడులో ఒకటి, మంత్రాలయం మండలంలో ఒకటి ప్రకారం 16 జిన్నింగ్ మిల్లుల్లో పత్తిని మద్దతు ధరతో కొనుగోలు చేస్తోంది. ఆ కేంద్రాలపై టీడీపీ నేతలు పెత్తనం చెలాయిస్తుండటం గమనార్హం. తమ వాళ్లు తెచ్చిన పత్తిని నాణ్యత ప్రమాణాలతో సంబంధం లేకుండా కొనుగోలు చేయాల్సిందేనని, ఇతరులు తెచ్చిన పత్తి ఎంత నాణ్యతతో ఉన్నప్పటికీ తిరస్కరించాలని సీసీఐ అధికారులను ఆదేశించారు. అధికార పార్టీ నేతలు ప్రతి కొనుగోలు కేంద్రం దగ్గర తమ ప్రతినిధులను పెట్టి వారు సూచించిన పత్తినే కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేసుకున్నా రు. ప్రధానంగా గూడూరు మండలం పెంచికలపాడు దగ్గర ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రంలో ప్రతి నిత్యం టీడీపీ నేతల తరుఫున ఒక వ్యక్తి తిష్ట వేసి ఆయన చెప్పిన వాహనాలను లోపలికి పంపుతూ మిగిలిన వాటిలో నాణ్యత లేదనే కారణంతో వెనక్కి పంపుతుండటం గమనార్హం.
నాణ్యత బాగున్నా.. వెనక్కే...
తేమ శాతం 10 శాతం వరకే ఉన్నా.. నాణ్యత ప్రమాణాలు మెరుగ్గా ఉన్నప్పటికీ ప్రతి రోజు 6 నుంచి 10 వాహనాలను వెనక్కి పంపుతున్నారంటే ఈ ప్రభావం టీడీపీ నేతలదేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తమ పెద్దసార్ తనను ఇక్కడే ఉండమన్నారని, వారి చెప్పిన వాహనాల్లోని పత్తిని మాత్రమే కొనాలని, మిగిలినవి తిరస్కరించాల్సిందేనని సీసీఐ అధికారులకు తేల్చి చెబుతుండటం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే పత్తికొనుగోలు కేంద్రాల దగ్గర టీడీపీ నేతలు ఏ స్థాయిలో హల్‌చల్ చేస్తున్నారో తెలుస్తోంది. నాణ్యత బాగున్నా.. తేమ శాతం 8–10 వరకే ఉన్నా.. తిరస్కరిస్తుండటంతో రైతులు కొనుగోలు కేంద్రానికి సమీపంలోనే ఉంటున్న దళారీలకు రూ.6,000 – 6,800 లోపే అమ్ముకుంటున్నారు. అదే పత్తిని దళారీలు క్వింటాకు రూ.8 వేల ధరతో అదే రైతుల పేర్లతో అమ్ముకుంటున్నారంటే దళారీలకు, సీసీఐ అధికారుల మధ్య సంబంధాలు ఏ స్థాయిలో ఉన్నాయే తెలుస్తోంది. దళారీలు దాదాపు 50 వేల క్వింటాళ్ల పత్తిని తక్కువ ధరకు కొని మద్దతు ధరతో అమ్ముకుంటున్నారు. రైతుల నోళ్లలో మట్టి ఎంతలా అక్రమార్జన సాగిస్తున్నారో స్పష్టమవుతోంది. కొనుగోలు కేంద్రాల దగ్గర టీడీపీ నేతల హవా, దళారీల ప్రభావం లేకుండా జిల్లా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
సీసీఐ అధికారులతో
దళారుల కుమ్మక్కు
అండగా నిలిచిన అధికార పార్టీ
నాయకులు
సిఫారసులో ఉంటే వాహనం లోపలికి
లేకపోతే నాణ్యత బాగున్నా వెనక్కే


