మరో ఇద్దరు రౌడీషీటర్ల జిల్లా బహిష్కరణ
కర్నూలు: కర్నూలు నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలోని శరీన్ నగర్‌లో నివాసముండే రౌడీషీటర్లు వడ్డే రేవంత్ కుమార్ (షీట్ నెం.387), వడ్డే శివకుమార్ (షీట్ నెం.388)లపై జిల్లా బహిష్కరణ వేటు పడింది. కిరాయి హంతకుడు, 19 కేసుల్లో నిందితుడిగా ఉండి ఈనెల 11న జిల్లా బహిష్కరణకు గురైన వడ్డే రామాంజినేయులు అలియాస్ అంజికి ముగ్గురు కుమారులు సంతానం. తండ్రితో పాటు ముగ్గురు కుమారులపైన నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీట్లు ఉన్నాయి. వీరు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రతిపాదనల మేరకు వారి క్రిమినల్ రికార్డులను నిశితంగా పరిశీలించి కలెక్టర్ జిల్లా బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేశారు. పెద్దవాడు తులసికుమార్‌పై శనివారం బహిష్కరణ ఉత్తర్వులు జారీ కాగా వడ్డే రేవంత్‌కుమార్, వడ్డే శివకుమార్‌పై ఆదివారం జిల్లా బహిష్కరణ ఉత్తర్వులు వెలువడ్డాయి. వీరిపై హత్యలు, దోపిడీలు, ఎస్సీ, ఎస్టీ వర్గాలపై దాడులు, జులుం, హత్యాయత్నం.. ఇలా పలు రకాల కేసులు ఉన్నాయి. ఈ ఏడాది మార్చి 14వ తేదీన శరీన్ నగర్‌లో సుంకన్న హత్య కేసులో తండ్రితో పాటు వీరు జైలుకు వెళ్లారు. బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత ఈనెల 5వ తేదీన తండ్రితో కలసి అదే కాలనీకి చెందిన అభిషేక్‌ను బెదిరించి కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించి వడ్డే రామాంజినేయులు, వడ్డే తులసికుమార్ ప్రస్తుతం కర్నూలు జిల్లా జైలులో ఉన్నారు. తాజాగా మరో ఇద్దరు కుమారులు వడ్డే రేవంత్ కుమార్, వడ్డే శివకుమార్‌లపై కూడా జిల్లా బహిష్కరణ వేటు వేయడంతో వారిని కూడా జిల్లా జైలుకు తరలించనున్నారు.
అరాచక శక్తులుగా మారితే పీడీ యాక్ట్: విక్రాంత్ పాటిల్, ఎస్పీ
చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో జిల్లాలో ఇప్పటివరకు ఐదుగురిని జిల్లా బహిష్కరణకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. రౌడీయిజంతో అరాచక శక్తులుగా మారి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలగజేసే విధంగా ఎవరు ప్రవర్తించినా వారిపై జిల్లా బహిష్కరణతో పాటు పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపుతాం. మంచిగా మారి గౌరవ ప్రద జీవితాన్ని గడపాలి.
వడ్డే శివకుమార్ వడ్డే రేవంత్ కుమార్
మరో ఇద్దరు రౌడీషీటర్ల జిల్లా బహిష్కరణ


