వేసవిలో మంచినీటి సమస్య తలెత్తరాదు
కర్నూలు (అర్బన్): రానున్న వేసవిలో జిల్లాలో ఎక్కడా మంచినీటి సమస్య తలెత్తకుండా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఇంజినీర్లు ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉండాలని ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ సీహెచ్ మనోహర్ ఆదేశించారు. బుధవారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు జిల్లాలోని ఈఈ, డీఈఈ, ఏఈలతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ.. ప్రధానంగా జిల్లాలోని పశ్చిమ ప్రాంతంతో పాటు మెజార్టీ గ్రామాలకు నీటిని సరఫరా చేసే తుంగభద్ర దిగువ కాలువకు జనవరి నెలలో నీటి ప్రవా హం ఆగిపోయే అవకాశముందన్నారు. ఈ నేపథ్యంలోనే ఎల్‌ఎల్‌సీ పరిధిలోని చెరువులన్నింటినీ నింపుకోవాలని సూచించారు. అలాగే జలజీవన్ మిషన్ కింద చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లాలోని ఆయా గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్లు అవసరమున్న వారి జాబితాలను ఈనెల 30 లోగా తయారు చేయాలని సూచించారు. సకాలంలో జాబితాలను రూపొందిస్తే వచ్చే నెల మొదటి వారంలో జరిగే సమావేశంలో వాటి నిర్మాణానికి జిల్లా కలెక్టర్ ద్వారా అనుమతి తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. ముఖ్యంగా రక్షిత మంచినీటి సరఫరా పథకాల నిర్వహణపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించాలన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఇంజినీర్లు నీటి సరఫరా పైప్‌లైన్లపై దృష్టి పెట్టాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సురక్షితమైన నీటిని అందించేందుకు ఆయా గ్రామాల్లోని నీటి ట్యాంకులను నిర్ణీత సమయంలోగా క్లోరినేషన్ చేయాలన్నారు. సమావేశంలో కర్నూలు, ఆదోని ఈఈలు అబ్దుల్ ఖాదర్, పద్మజ తదితరులు పాల్గొన్నారు.


