పాత తూకం.. కొత్త మోసం
ఆదోని అర్బన్: అధికారుల నిర్లక్ష్యంతో పత్తి రైతులు దగాకు గురవుతున్నారు. అడిగేవారు లేకపోవడంతో మహారాష్ట్ర వ్యాపారులు గద్దల్లా వాలి రైతు కష్టాన్ని దర్జాగా దోచుకుంటున్నారు. అధిక ధర ఆశచూపి తూకాల్లో మోసానికి పాల్పడుతున్నా అధికారులు కన్నెత్తి చూడటం లేదు. ఆదోని వ్యవసాయ మార్కెట్‌లోనే నాణ్యత పత్తికి రూ.7,330 ధర పలుకుతోంది. అటువంటిది ఇతర రాష్ట్రం నుంచి వచ్చి పత్తి క్వింటాకు ఎలాగున్నా సరే రూ.7,300 ఇస్తుండటంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు 15 రోజులుగా మహారాష్ట్రకు చెందిన వ్యాపారస్తులు పాత తక్కెడ తూకాలతో కోసిగి, కౌతాళం, హాల్వి మండలాల చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లి పెద్ద పెద్ద లారీలను తీసుకెళ్లి కొనుగోలు చేస్తున్నారు. కేవలం కుడివైపు 50 కేజీల రాళ్లను తాడుతో వేలాడదీడయం, ఎడమవైపు ఒక పెద్ద సంచిని వేలాడదీసి తూకం వేస్తు న్నారు. దీంతో 50 కేజీల పత్తికి గానూ 8 నుంచి 10 కేజీల వరకు తూకంలో మోసం జరుగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా ఒక క్వింటానికి 15 కేజీల నుంచి 20 కేజీల వరకు రైతులు నష్టపోతున్నారు. ఈ క్రమంలో రైతు క్వింటాకు రూ.7300 ప్రకారం చెల్లించినా రూ.1466 చొప్పున నష్టపోవాల్సిందే.
రోజుకు ఎనిమిది లారీల్లో తరలింపు..
మహారాష్ట్రకు చెందిన పత్తి వ్యాపారస్తులు 15 రోజుల నుంచి ఆదోని చుట్టుపక్కల గ్రామాల్లో రోజుకు 8 లారీలు పత్తి దిగుబడులను కొనుగోలు చేసుకుని మహారాష్ట్రకు తరలిస్తున్నారు. ఒక లారీ వంద క్వింటాళ్లకు పైగానే ఉంటుంది. దీని ప్రకారం 800 క్వింటాళ్లు రోజూ లారీల్లో తరలిస్తున్నారు. 15 రోజుల్లో ఇప్పటి వరకు 120 లారీల్లో 96 టన్నుల పత్తిని మహారాష్ట్రకు చెందిన వ్యాపారస్తులు కొనుగోలు చేశారు. మరో వైపు ప్రభుత్వ ఆదాయానికి రూ. లక్షల్లో గండి పడుతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పత్తి దిగుబడులను తక్కెడ తూకాల్లో వేయకూడదు. కేవలం ఎలక్ట్రానిక్ మిషన్‌లోనే తూకాలు వేయాలి. తక్కెడ తూకాల్లో మోసం ఉంది. అధిక ధర ఇస్తామంటే రైతులు మోసపోవద్దు. ముందుగా రాళ్లు, ముళ్లును సరి చూసుకోవాలి. ఏదైనా మోసం జరిగినట్లు అనిపిస్తే అధికారులకు సమాచారం ఇవ్వాలి.
– శంకర్, తూనికల కొలతల శాఖ ఆదోని ఇన్‌చార్జి అధికారి
పత్తి కొనుగోళ్లకు మహారాష్ట్ర వ్యాపారులు
ఎక్కువ ధర ప్రకటించి పాత తూకాలతో
మోసగిస్తున్న వైనం
క్వింటానికి 15 కేజీలకు పైగా దోపిడీ
ఎక్కడా కనిపించని ఎలక్ట్రానిక్ కాటాలు
పట్టించుకోని తూనికల శాఖ అధికారులు
పాత తూకం.. కొత్త మోసం


