శివ.. శివా.. నీవే మాకు రక్ష!
శ్రీశైలంటెంపుల్: కార్తీకం.. పరమేశ్వరుడికి ఇష్టమైన మాసం. ఈ నెలలో ఈశ్వరుడిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఇరు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి అధికసంఖ్యలో తరలివచ్చి స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. భక్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తామని ప్రకటన చేసిన దేవస్థాన అధికారులు ఆచరణలో మాత్రం విఫలం అయ్యారు. కంపార్ట్‌మెంట్లలో, క్యూలైన్లలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ‘శివ.. శివా.. నీవే మాకు రక్ష’ అని కంపార్టుమెంట్లలో స్వామిని చేతులెత్తి వేడుకున్నారు.
గంటల తరబడి నిరీక్షణ
శ్రీశైల మహాక్షేత్రంలో అక్టోబరు 22 నుంచి శుక్రవారం వరకు కార్తీకమాసోత్సవాలు నిర్వహించారు. క్యూలైన్లలో, కంపార్ట్‌మెంట్లలో భక్తులు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే అధికారులు ఏర్పాట్లు చేయలేదు. రేకులషెడ్డు కంపార్ట్‌మెంట్లలో పరిమితికి మించి భక్తులు కనిపించారు. చాలా మంది ఊపిరి అడక అవస్థలు పడ్డారు. చిన్నారులు, బాలింతలు, వృద్ధుల అవస్థలు వర్ణానాతీతం. కష్టాలను ఎదు ర్కొని కంపార్ట్‌మెంట్లు దాటుకుని వచ్చిన భక్తులు ఆలయ ధ్వజస్తంభం నుంచి గర్భాలయం వరకు చేరుకునేందుకు మళ్లీ గంటల తరబడి క్యూలైన్లలో నిరీక్షించాల్సి వచ్చింది. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, షుగర్ రోగులు, వృద్ధులు చాలా ఇబ్బంది పడ్డారు. దీంతో భక్తులు క్యూలైన్లలోనే నిరసన తెలిపారు. ‘ఇదేం పాలన’ అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు సైతం చేశారు.
పాలన అస్తవ్యస్తం
● కార్తీకమాసమంతా శని, ఆది, సోమ, రద్దీ రోజుల్లో మల్లన్న స్పర్శదర్శనాన్ని రద్దు చేశారు. అయితే వీఐపీల పేరుతో కొందరు దేవస్థాన ఉన్నతాధికారులే స్వయంగా ఆలయానికి వచ్చి దగ్గరుండి అన్ని క్యూలైన్లను మూసివేయించి స్పర్శ దర్శనం చేయించారు.
● సిఫార్సుల లేఖలకు ఇష్టం వచ్చినట్లు స్పర్శదర్శనం టికెట్లు ఇచ్చారనే అరోపణలు వచ్చాయి.
● సామాన్య భక్తులకు స్వామివారి స్పర్శదర్శనం అవకాశం కలగలేదు.
● కొందరు దేవస్థాన అధికారులు అర్హత లేని వారితో ప్రధాన గేటు ద్వారానే ఆలయ ప్రవేశం చేయించారు. ప్రధాన గేటుకు ఉన్న ప్రతిష్టతను మంట కలిపారనే విమర్శ లు వచ్చాయి.
● ఆలయంలో దీపారాధన చేయడం లేదని చెప్పిన కొందరు అధికారు లు కుటుంబ సభ్యులతో అందుకు విరుద్ధంగా వ్యవహరించారు.
శ్రీశైలంలో మోగిన
అవస్థల గంట!
కంపార్ట్‌మెంట్లలో, క్యూలైన్లలో
భక్తులకు తప్పని తిప్పలు
అధికారుల పర్యవేక్షణ కరువు
ముగిసిన కార్తీక మాసం


