భవనాశి వాగులో పడి రైతు మృతి
చాగలమర్రి: కలుగొట్లపల్లె పంచాయతీకి మజరా గ్రామమైన నగళ్లపాడు గ్రామానికి చెందిన ఓ రైతు ప్రమాదవశాత్తూ వాగులో పడి మృత్యువాత పడ్డాడు. కుటుంబీకులు తెలిపిన వివరాల మేరకు. గ్రామానికి చెందిన పాడి రైతు మురబోయిన రామ సుబ్బరాయుడు(60), అతని భార్య లక్ష్మీదేవితో కలిసి గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో భవనాశి వాగు వద్ద పశువులు మేపుతున్నారు. కొద్ది సేపటి తర్వాత గేదెలు కనిపించకపోవడంతో వాగు అవతల చూసేందుకు నీటిలో దిగగా.. గుంతల్లో గల్లంతయ్యాడు. భార్య గమనించి కేకలు వేయడంతో సమీపంలో ఉన్న వారు వచ్చి కాపాడే ప్రయత్నం చేశారు. నీటిలో గాలించగా రామ సుబ్బరాయుడు విగతజీవిగా కనిపించాడు. గ్రామస్తుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు.


