వైద్య కళాశాలల ప్రయివేటీకరణపై ప్రజా పోరాటానికి సిద్ధం
కర్నూలు(టౌన్): వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ ప్రజా పోరాటానికి సిద్ధంగా ఉందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక ధర్నా చౌక్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీరాజ్ విభాగం, పార్టీ అనుబంధ విభాగాల ఆధ్వర్యంలో వైద్య కళాశాలల ప్రయివేటీకరణను నిరసిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ నిర్మాణంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలను మంత్రి లోకేష్ అనుయాయులకు కట్టబెట్టేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు పీపీపీ పద్ధతిని తెరపైకి తెచ్చారన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రయివేటీకరణను అడ్డుకుంటామన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే వీటిని నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూస్తామన్నారు. కుడా మాజీ చైర్మన్, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ వైద్య కళాశాలలను ప్రయివేటీకరించాలన్న చంద్రబాబు నిర్ణయం హేయమైందన్నారు. ఫీజులు కట్టలేని ఎంతో మంది విద్యార్థులు వైద్యులుగా రాణించాలంటే ప్రభుత్వ వైద్య కళాశాలలతోనే సాధ్యమన్నారు. ప్రయివేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు అన్ని వర్గాల ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందన్నారు. కోడుమూరు సమన్వయకర్త ఆదిమూలపు సతీష్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి తెర్నెకల్ సురేందర్ రెడ్డిలు మాట్లాడుతూ నిరుపేద, మధ్య తరగతి విద్యార్థినీ, విద్యార్థులు వైద్యులుగా రాణించే అవకాశాలను చంద్రబాబు ప్రభుత్వం నాశనం చేస్తోందన్నారు. కార్యక్రమంలో కోడుమూరు మాజీ ఎమ్మెల్యేలు మణిగాంధీ, సుధాకర్, వైఎస్సార్‌సీపీ పంచాయతీ రాజ్ విభాగం జిల్లా అధ్యక్షుడు అస్లాం, కర్నూలు జెడ్పీటీసీ ప్రసన్న కుమార్, వైస్ ఎంపీపీ నెహెమియ్యా, గూడురు వైస్ చైర్మన్ లక్ష్మన్న, కౌన్సిలర్ మద్దిలేటి, కర్నూలు జిల్లా అధికార ప్రతినిధి పోలకల్ ప్రభాకర్‌రెడ్డి, కర్నూలు మండల కన్వీనర్ మోహన్ బాబు, గూడురు మండల కన్వీనర్ రామాంజనేయులు, కర్నూలు మండల పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షులు సంపత్‌కుమార్, ఎస్సీ సెల్ అధ్యక్షులు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.


