నేడు జిల్లాలో సెంట్రల్ టీం పర్యటన
కర్నూలు(అగ్రికల్చర్): ఉల్లి పంటపై అధ్యయనానికి ఈ నెల 18న జిల్లాలో సెంట్రల్ టీం పర్యటించనుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఉల్లి సాగు చేసి అధిక వర్షాలతో కోలుకోలేని విధంగా నష్టపోయిన నేపథ్యంలో సెంట్రల్ టీం జిల్లాకు రానుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. కేంద్ర ఉద్యాన మంత్రిత్వ శాఖ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ బిజే బ్రహ్మ ఆధ్వర్యంలో ఈ బృందం జిల్లాలో పర్యటించనుంది. మంగళవారం మధ్యాహ్నం 1 గంటకు కర్నూలు చేరుకోనున్న సెంట్రల్ టీం భోజనం తర్వాత క్షేత్రస్థాయికి వెళ్లనుంది. కర్నూలు జిల్లాలో కోడుమూరు మండలం ప్యాలకుర్తి, కోడుమూరు, దేవనకొండ, గోనెగండ్ల ప్రాంతాల్లో పర్యటించే విధంగా ఉద్యాన శాఖ షెడ్యూల్ రూపొందించింది. నంద్యాల జిల్లాలో ఈ నెల 19న సెంట్రల్ టీం డోన్ మండలంలో పర్యటించనుంది.
సెంట్రల్ టీం దృష్టికి పంట నష్టం
● అధిక వర్షాలతో ఉల్లి పంటకు జరిగిన నష్టాన్ని కేంద్రబృందం దృష్టికి తీసుకెళ్లేందుకు రైతులు, రైతు సంఘాలు సిద్ధమయ్యాయి.
● గతంలో ఎప్పుడూ లేని విధంగా వేలాది మంది రైతులు ఉల్లి సాగు చేసి నష్టాలు మూట కట్టుకున్నారు.
● ఈ ఏడాది పెట్టుబడి వ్యయం ఎకరాకు రూ.లక్ష పైనే ఉన్నట్లు రైతులు చెబుతున్నారు.
● ఆగస్టు నెల నుంచి అధిక వర్షాలు కురుస్తుండటంతో ఉల్లి పంట భారీగా దెబ్బతినింది.
● ఎకరాకు గరిష్టంగా 80 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. ఇందులో అధిక వర్షాల కారణంగా 40 క్వింటాళ్లకుపైగా పనికిరాకుండా పోయింది.
● క్వింటాకు రూ.400–500 వరకు ధర మాత్రమే లభించింది.
● రూ.100, రూ.150తో అమ్ముకున్న రైతులు భారీగా ఉన్నారు.
● చంద్రబాబు ప్రభుత్వం తొలుత క్వింటా రూ.1,200 మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని ప్రకటించి.. ఆ తర్వాత ఎకరాకు రూ.20 వేలు పరిహారం ఇస్తామని నమ్మబలికినా అతీగతీ లేకపోవడం గమనార్హం.


