పెయ్యదూడల అభివృద్ధిని ప్రోత్సహించాలి
కర్నూలు(అగ్రికల్చర్): నాటు ఆవులు, గేదెల ద్వారా లింగనిర్ధారణ వీర్యంతో మేలుజాతి పెయ్య దూడల అభివృద్ధిని ప్రోత్సహించాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ హేమంత్‌కుమార్ తెలిపారు. సోమవారం కర్నూలు డివిజన్‌లోని వెటర్నరీ అసిస్టెంటు సర్జన్‌లు, ఏరియా హాస్పిటల్స్ ఏడీలతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కర్నూలు డివిజన్‌లో లింగ నిర్ధారణ వీర్యంతో 5,000 పశువులకు కృత్రిమ గర్భధారణ సూదులు వేయించాలనేది లక్ష్యమని ఇప్పటి వరకు 1100 పశువులకు మాత్రమే వేశారని తెలిపారు. లింగనిర్ధారణ వీర్యంతో కృత్రిమ గర్భధారణ చేయడం వల్ల ఆడదూడలే పుడుతాయని, ఇందువల్ల పాడిని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఒక్క డోసు పూర్తి ధర రూ.500 ఉండగా.. కేంద్రం రూ.350 సబ్సిడీ ఇస్తుందని తెలిపారు. రైతులు కేవలం రూ.150 చెల్లించాల్సి ఉంటుందన్నారు. కర్నూలు డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ వసంతలక్ష్మి మాట్లాడుతూ... సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమావేశంలో పశుగణాభివృద్ధి సంస్థ డీడీ డాక్టర్ రాజశేఖర్, ఏడీలు భవానీశంకర్‌రెడ్డి, జిల్లా గొర్రెల అభివృద్ధి విభాగం ఏడీ రవిప్రకాశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


