‘బహుళ’ తప్పిదం
కర్నూలు(అగ్రికల్చర్): సామూహికంగా ఇళ్లు నిర్మించుకోవాలన్నా.. గొర్రెలు, చేపల పెంపకం చేపట్టాలన్నా సహకార వ్యవస్థ దోహద పడుతుంది. మార్క్‌ఫెడ్, నాఫెడ్, ఎస్సీ, బీసీ కార్పొరేషన్లు సైతం ఈ వ్యవస్థ కిందనే ఏర్పాటయ్యాయి. అయితే రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ ఏర్పాటు అయిన తర్వాత సహకార వ్యవస్థ తిరోగమనం అయ్యింది. ప్రగతికి సహాయ నిరాకరణ జరుగుతోంది. సహకార శాఖ ఆధ్వర్యంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు, జిల్లా సహకార కేంద్రబ్యాంకుకు, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీలకు టీడీపీ నేతలు, కార్యకర్తలతో పాలకవర్గాలు ఏర్పాటు చేశారు. ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా 18 నెలల కాలంలో చేయలేదు.
ఇదీ దుస్థితి..
ఉమ్మడి జిల్లాలోని 99 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్) ఉన్నాయి. ఇందులో 2014–15 నుంచి 2018–19 వరకు 85 సంఘాల వరకు నష్టాల్లో కూరుకపోయాయి. నాటి ఐదేళ్ల కాలంలో సహకార సంఘాల అభివృద్దికి చేసింది సున్నానే. ఆ ఐదేళ్లు సహకార రంగానికి చీకటి రోజులే. అలాంటి పరిస్థితులే మళ్లీ ఉత్పన్నం అవుతున్నాయి. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఎమ్మిగనూరు చేనేత సహకార సంఘం నేడు డీలా పడింది. చేనేత సహకార సంఘాలు ఉనికిని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి జిల్లాలో 99 సహకార సంఘాలు ఉండగా అత్యధిక సంఘాలు నష్టాల్లో కూరుకపోయాయి. ఇందులో 70 సంఘాలు నష్టాల్లో మునిగితేలుతున్నాయి. వీటిని లాభాల బాట పట్టించేందుకు ఎలాంటి చర్యలు లేవు. వీటికి అనుబంధంగా గత ప్రభుత్వం మల్టీపర్పస్ గోదాములు నిర్మిస్తే చంద్రబాబు సర్కార్ వీటిని సద్వినియోగం చేసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తోంది. ఫలితంగా 2024–25లో రూ.50 కోట్లు లోనింగ్ జరగలేదు. సంఘాలకు నిరర్ధక ఆస్తులు పెరిగిపోతున్నాయి.
నష్టాలే మిగిలాయి!
ఉమ్మడి జిల్లాలో 99 సహకార సంఘాలు ఉండగా చాలా వరకు నష్టాల్లో కూరుకుపోయాయి. కల్లూరు సహకార సంఘానికి రూ.1,57,98,842, గూడూరు సహకార సంఘానికి రూ.1,52,41,998, పసుపుల సహకార సంఘానికి రూ.70,72,847 నష్టాలు ఉన్నాయి. సహకార సంఘాలకు ఉన్న నష్టాలను అధిగమించేందుకు చంద్రబాబు సర్కార్ నుంచి ప్రోత్సాహం లేకుండాపోయిందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
నేటి నుంచి వారోత్సవాలు...
72వ అఖిల భారత సహకార వారోత్సవాలు ఈ నెల 14 నుంచి 20 వరకు జరగనున్నాయి. ఆత్మనిర్బర్ భారత్‌కు సాధకాల సహకారం అనేది ఈ ఏడాది థీమ్. జాతీయ స్థాయిలో సహకార వ్యవస్ధ పటిష్టతకు ప్రాధాన్యత ఉన్నప్పటికీ రాష్ట్రంలో మాత్రం నిరాదరణ చుట్టుముట్టింది. వారోత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం స్థానిక జిల్లా సహకార కేంద్రబ్యాంకులో జరిగే కార్యక్రమంలో సహకార పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. షెడ్యూల్ ప్రకారం సహకార వారోత్సవాలను నిర్వహించేందుకు జిల్లా సహకార శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. చంద్రబాబు సర్కార్ ఏర్పాటు తర్వాత ప్రగతి అంటూ ఏదీ లేకుండా పోయింది. దీంతో 72వ సహకార వారోత్సవాల్లో సహకార ప్రగతి చాటి చెప్పడానికి అధికారులకు అవకాశమే లేకుండా పోయింది. వారోత్సవాలను తూతూమంత్రంగా నిర్వహించనున్నట్లు సమాచారం.
పోస్టర్ల ఆవిష్కరణ
అఖిలభారత సహకార వారోత్సవాలను పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సహకార అధికారి వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కాగా శుక్రవారం సహకార వారోత్సవాలను కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి ప్రారంభించనున్నారు.
వైఎస్సార్‌సీపీ హయాంలో ఇలా..
2019లో వైఎసార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత సహకార సంఘాల దశ తిరిగింది. వీటిని బహుళ సేవా కేంద్రాలుగా మార్పు చేసేందుకు తీసుకున్న చర్యలు తీసుకున్నారు. సహకార సంఘాల్లో 2023లోనే కంప్యూటరీకరణ చేసి మినీ బ్యాంకులుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకున్నాయి. ఫలితంగా అనేక సంఘాలు ఆస్తులు పెంచుకున్నాయి. వ్యాపారాలు అభివృద్ధి చేస్తున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రతి ఏటా రూ.400 కోట్ల వరకు లోనింగ్ జరిగేది.
సహకార వ్యవస్థను పట్టించుకోని
చంద్రబాబు సర్కార్
18 నెలల్లో ఒక్క అభివృద్ధి కూడా
చేయలేదు
నేటి నుంచి సహకార వారోత్సవాలు
ప్రజలకు ఏం చెప్పాలో తెలియక
అధికారుల తికమక!
‘బహుళ’ తప్పిదం


