టెండర్ ‘క్లాస్’గా కట్టబెట్టేందుకు..!
శ్రీశైలంటెంపుల్: ‘వడ్డించే వాడు మనవాడు అయితే బంతిలో ఎక్కడ కూర్చుంటే ఏంటి’.. అన్న చందంగా మారింది దేవస్థాన ఇంజినీర్ల వ్యవహారశైలి. అర్హత లేని కాంట్రాక్టర్‌కు పనులు దక్కేలా తమ పనితనం చూపారు. కార్తీక మాసోత్సవాల్లో భాగంగా ఈ ఏడాది నూతనంగా పాతాళగంగలో తెప్పోత్సవం నిర్వహించాలని దేవస్థాన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈనెల 18వ తేదీన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కాగా తెప్పోత్సవానికి సంబంధించి హంస వాహనం తయారు చేయడానికి కావాల్సిన మెటీరియల్ సరఫరా, ట్రాన్స్‌పోర్టు, ఫిక్సింగ్ చేసేందుకు రూ.21.81 లక్షల అంచనాతో ప్రతిపాదనలు సిద్ధం చేసి టెండర్ పిలిచారు. అక్టోబరు 30న టెండర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. సాధారణంగా టెండర్ నోటిఫికేషన్ ఇచ్చిన తరువాత 14 రోజుల కాలవ్యవధి ఇస్తారు. కానీ ఈ పనికి మాత్రం కేవలం ఐదు రోజులు మాత్రమే కాలవ్యవధి ఇచ్చారు. కాంట్రాక్టర్లతో తమకు ఉన్న అనుబంధాన్ని పోగొట్టుకు లేక ఏకంగా తమ వారి కోసం నిబంధనలను సైతం మార్చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎలాగైనా తాము అనుకున్న కాంట్రాక్టర్‌కే పని దక్కేలా విశ్వప్రయత్నాలు చేస్తూ పప్పులో కాలేశారు. పని విలువ రూ.21.81 లక్షలు ఉన్నప్పుడు నిబంధనల మేరకు క్లాస్–4, అపైన ఉండే కాంట్రాక్టర్లు అర్హులు అవుతారు. కానీ మన ఇంజినీర్లు టెండర్ షెడ్యూల్‌లో క్లాస్–5, అపైన వారు అర్హులుగా నోటిఫికేషన్ ఇచ్చారు. క్లాస్–5 కాంట్రాక్టర్ రూ.10 లక్షల లోపు పనులు మాత్రమే చేసేందుకు అర్హులు. కానీ ఇక్కడ పని విలువ రూ.21.81 లక్షలు ఉన్నప్పుడు క్లాస్–4, అపై కాంట్రాక్టర్ అర్హులు. కానీ మన ఇంజినీర్లు తమకు కావాల్సిన కాంట్రాక్టర్‌కు పని దక్కేలా క్లాస్–5 టెండర్‌లో పొందుపరిచారు. ఈ టెండర్‌కు ఇద్దరు కాంట్రాక్టర్లు టెండర్ దాఖాలు చేశారు. నేడో, రేపో టెండర్లను ఓపెన్ చేయనున్నారు. ఇప్పటికై న దేవదాయశాఖ ఉన్నతాధికారులు స్పందించి నిబంధనలు ఉల్లంఘించే దేవస్థాన ఇంజినీర్లపై చర్యలు తీసుకుని, మల్లన్న ఆదాయాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాగా ఈ విషయంపై శ్రీశైల దేవస్థాన ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ నరసింహారెడ్డిని వివరణ కోరగా.. తెప్పోత్సవానికి సంబంధించి హంస వాహనం టెండర్‌లో క్లాస్–5, ఆపైన ఏదేని సివిల్ రిజిస్ట్రేషన్ కలిగిన కాంట్రాక్టర్లు ఎవరైనా పాల్గొనవచ్చునని తెలిపారు.
శ్రీశైల ఇంజినీర్ల ఇష్టారాజ్యం
ఓ కాంట్రాక్టర్‌కు హంస వాహనం
టెండర్ వరించేలా నిబంధనలు మార్పు
క్లాస్–4 వర్క్‌ను క్లాస్–5గా
మార్పులు చేసిన వైనం


