రోజుకో పుంజు చొప్పున ఏసీబీకి పట్టిస్తా!
● వీఆర్వోలందరూ అవినీతిపరులే..
● మండల మీట్‌లో
టీడీపీ సర్పంచ్ హల్‌చల్
● అవాకై ్కన అధికారులు
డోన్: మండల సర్వసభ్య సమావేశంలో టీడీపీ మద్దతుదారుడైన గుమ్మకొండ సర్పంచ్ తీరుతో అధికారులు తలలు పట్టుకున్నారు. సభలో సంబంధం లేని అంశాలపై మాట్లాడమే కాకుండా.. వీఆర్వోలపై నోరు పారేసుకోవడంతో అధికారులు అవాక్కయ్యారు. ఎంపీడీఓ వెంకటేశ్వరరెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి ఎంపీపీ రేగటి రాజశేఖర్ రెడ్డి, జెడ్పీటీసీ బద్దల రాజ్‌కుమార్, సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చ జరుగుతుండగా గుమ్మకొండ సర్పంచ్ దశరథరామిరెడ్డి వీఆర్‌ఓలపై రెచ్చిపోయారు. ‘మండలంలో పనిచేస్తున్న వీఆర్‌ఓలందరూ అక్షరం ముక్క రాని వారు. అందరూ అవినీతిపరులు. ఇలాంటి వారి పట్ల రైతులకు ఏమి మేలు జరుగుతుంది. నేను అనుకుంటే రోజుకో పుంజు చొప్పున అన్నట్లు ఏసీబీకి అధికారులను పట్టిస్తా’ అంటూ సవాల్ చేశారు. ఆయన వ్యాఖ్యలను ఎలక్షన్ డీటీ నారాయణమ్మ తప్పుబడుతూ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎవరైనా అవినీతిపరులు ఉంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని, అందరూ అవినీతిపరులని సంబోధించడం సబబు కాదన్నారు. వీఆర్వోలపై నోరు పారేసుకున్న సర్పంచ్.. ప్యాకెట్ పాల వల్ల క్యాన్సర్ వ్యాధి ప్రబలుతుందని, విక్రయాలను వెంటనే నిషేధించాలని డిమాండ్ చేశారు. అయితే తమకు సంబంధం లేదని పశుసంవర్థక శాఖ అధికారులు చెబుతున్నా ఆయన ఉపన్యాసం ఆపలేదు. అలాగే వంద పడకల ప్రభుత్వాసుపత్రిలో ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యాలు అనధికారికంగా పీఆర్‌ఓలను ఏర్పాటు చేసి గర్భిణులను భయబ్రాంతులకు గురిచేసి సిజేరియన్ల కోసం తమ ఆసుపత్రులకు తీసుకువెళ్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్‌తో పాటు డీఎంహెచ్‌ఓకు ఫిర్యాదు చేస్తా మని ఎంపీపీ హామీ ఇచ్చారు. కాగా సర్యసభ్య సమావేశానికి ప్రజా ప్రతినిధుల స్థానంలో వారి కుటుంబీకులు హాజరైనా అధికారులు పట్టించుకోకపోవడంపై ఎంపీడీఓను కొందరు సభ్యులు ప్రశ్నించారు.


