ఆర్టీసీ బస్టాండ్‌లో విస్తృత తనిఖీలు
కర్నూలు: ఢిల్లీలో జరిగిన బాంబు పేలుడు నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు కర్నూలు ఆర్టీసీ బస్టాండ్‌లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. డీఎస్పీ బాబు ప్రసాద్ నేతృత్వంలో సీఐలు, ఎస్‌ఐలు తమ సిబ్బందితో బృందాలుగా ఏర్పడి బస్టాండ్ ఆవరణలో నెలల తరబడి పార్కు చేసి ఉన్న బైకులు, కార్లు, పార్సిల్, రవాణా కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు. స్పెషల్ పార్టీ పోలీసులతో పాటు బాంబ్ స్క్వాడ్ బృందాలు పోలీసు జాగిలాలతో కలసి ఆర్టీసీ బస్టాండ్‌లోని అనుమానితులు, ప్రయాణికుల బ్యాగులు, బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. పార్సిల్ కార్యాలయంలో లగేజీలపై ప్రత్యేక నిఘా ఉంచి తనిఖీ చేశారు. అనుమానితుల వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే 112 లేదా 100 నంబర్లకు డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించాలని డీఎస్పీ సూచించారు. సీఐలు నాగరాజరావు, మన్సూరుదీన్, ఎస్‌ఐ శ్రీనివాసులు పాల్గొన్నారు.


