
పెద్దాసుపత్రిలో ఇద్దరికి అరుదైన శస్త్రచికిత్సలు
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఇద్దరు రోగులకు అరుదైన శస్త్రచికిత్సలు చేసి వైద్యులు ప్రాణం పోశారు. శనివారం వైద్యులను తన చాంబర్‌లో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు, కేఎంసీ వైస్ ప్రిన్సిపాల్, జనరల్ సర్జరీ హెచ్‌ఓడీ డాక్టర్ హరిచరణ్ అభినందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జనరల్ సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ రామకృష్ణ నాయక్ ఆపరేషన్ వివరాలు తెలిపారు. వివరాలు ఆయన మాటల్లోనే...‘బేతంచెర్లకు చెందిన సుమలత(25) నాలుగేళ్లు గా తరచూ రక్తపు వాంతులు, అధిక మాసిక రక్తస్రావం, ప్యాన్‌సైటోపెనియా కారణంగా తరచూ రక్తం ఎక్కించుకుంటూ వచ్చారు. గతంలో ఈవీఎల్ బ్యాండింగ్ చేయించుకున్న ఆమెకు గత నెల 15వ తేదీన ఆసుపత్రిలో చేరారు. అదే నెల 24న ఆమెకు స్ల్పీనెక్టమి అనంతరం స్ల్పీనోరెనల్ షంట్ శస్త్రచికిత్స చేశారు. శస్త్రచికిత్స సమయంలో ఆమె ప్లీహం పరిమాణం 20శ్రీ15 సెం.మీ,బరువు 1.5 కిలోలుగా నమోదైంది. ఆమె ప్లేట్‌లెట్‌ల సంఖ్య కేవలం 46 వేలు ఉండగా ఆపరేషన్ అనంతరం అది 5 లక్షలకు చేరుకుంది. ఆప రేషన్ తర్వాత ఆమెకు ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకపోవడంతో ఈ నెల 9వ తేదీన డిశ్చార్జ్ చేశాం. అలాగే గోనెగండ్లకు చెందిన రంగస్వామి(53) మద్యపానం అలవాటు ఉంది. తరచూ కడుపునొప్పితో బాధపడుతున్న ఆయన గత జూన్ 26న ఆసుపత్రిలో చేరాడు. ఆయనకు వైద్యపరీక్షలు చేయగా క్రానిక్ కేల్సి ఫిక్ పాంక్రియాటైటిస్‌గా నిర్ధారణ అయ్యింది. అదే నెల 29వ తేదీన ఆయనకు లాటరల్ పాంక్రియాటికో–జెజునోస్టమి అనే శస్త్రచికిత్స చేశాం. ఆపరేషన్ సందర్భంలో ఆయన పాంక్రియాస్‌లో 10 రాళ్లు ఉండగా అందులో ఒకటి 3శ్రీ2 సెం.మీ పరిమాణంలో ఉండటం అరుదైన విషయం. ఆపరేషన్ అనంతరం కోలుకోవడంతో జులై 5వ తేదీన ఆయనను డిశ్చార్జ్ చేశాం’ అని వివరించారు. ఆపరేషన్ చేసిన వారిలో ప్రొఫెసర్ డాక్టర్ జయరామ్, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సబీరా, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రణీత్, డాక్టర్ ప్రశాంతి, పీజీలు, అనెస్తీషియా వైద్యులు హెచ్‌ఓడీ డాక్టర్ విశాల, ప్రొఫెసర్ డాక్టర్ సుధీర్, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అరుణలత, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సంజీవకుమార్ ఉన్నట్లు తెలిపారు.