
స్వర్ణ రథంపై దివ్యతేజం
● శ్రీమఠంలో వైభవంగా శ్రీరాఘవేంద్రుల మధ్యారాధన
మంత్రాలయం: సద్గురు శ్రీరాఘవేంద్రులు సశరీరంగా బృందావన ప్రవేశం చేసిన శుభదినం.. పరమగురుడి 354వ ఆరాధన పర్వదినం.. వేదభూమి పులకించి తుంగభద్రమ్మ పరవశించిన తరుణం.. చూసిన కనులదే మహాభాగ్యం. విశ్వమోహనుడి ఆరాధన సప్తరాత్రోత్సవాల్లో భాగంగా నిర్వహించిన మధ్యారాధన మహా మంగళకరం. సోమవారం శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల ఆశీస్సులతో మధ్యారాధన దేదీప్యమానంగా సాగింది. వేడుకల్లో భాగంగా రాఘవేంద్రుల మూల బృందావనానికి మహా పంచామృతాభిషేకం చేశారు. అభిషేకం వేళ భక్తజన వాహిని శ్రీమఠం ప్రాంగణ వీధుల్లో కిక్కిరిసింది. రెండు గంటల పాటు మంత్రోచ్ఛారణలు, భక్తజన హర్షధ్వానాల మధ్య అత్యంత పవిత్రంగా చేపట్టారు. భక్తజనుల కోసం ప్రత్యక్ష ప్రసారం, ఎల్‌ఈడీ తెరల ద్వారా వీక్షణ సదుపాయం కల్పించారు.
రమణీయంగా రథయాత్ర
మధ్యారాధన సందర్భంగా మధ్యాహ్నం శ్రీరాఘవేంద్రుడిని బంగారు రథంపై ఊరేగించారు. రాయరు బంగారు ప్రతిమను స్వర్ణ రథంపై కొలువుంచగా పీఠాధిపతి నారికేళ సమర్పణతో మంగళ హారతులు పట్టి రథయాత్రకు అంకురార్పణ పలికారు. పండితుల వేదఘోష, మంగళ వాయిద్యాలు మధ్య శ్రీమఠం ప్రాంగణ వీధుల్లో రథయాత్ర రమణీయంగా సాగింది. వేడుకలో మేళతాళాలు, నృత్య ప్రదర్శనలు, సంకీర్తనాలాపనలు భక్తులను మైమరిపించాయి. రాఘవేంద్రస్వామి బృందావన ప్రవేశం చేసిన శుభదినం కావడంతో భక్తులు అత్యధిక సంఖ్యలో తరలి వచ్చారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ నలుమూలల నుంచి వేలకుపైగా భక్తులు తరలివచ్చినట్లు అంచనా. అలాగే రాత్రి పరిమళ తీర్థం పుష్కరిణిలో ఉత్సవమూర్తి తెప్పోత్సవం ఎంతో రమణీయంగా సాగింది. వేడుక భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. తెప్పోత్సవం అనంతరం ప్రహాదరాయలను గజవాహనంపై కడు వైభవంగా ఊరేగించారు.
అలరించిన నృత్య ప్రదర్శనలు
ఉత్సవాల్లో భాగంగా యోగీంద్ర సభా మంటపంలో నృత్య ప్రదర్శనలకు అలరించాయి. వేడుకలో పండితకేసరి గిరియాచార్, ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్–1 శ్రీనివాసరావు, మేనేజర్–2 వెంకటేష్‌జోషి, జోనల్ మేనేజర్ శ్రీపతిఆచార్, ధార్మిక సహాయకాధికారి వ్యాసరాజాచార్, సంస్కృత గురుకులం ఉపకులపతి పంచముఖి, ద్వారపాలక అనంతస్వామి, వేద పాఠశాల మాజీ ప్రిన్స్‌పాల్ వాదిరాజాచార్, సీఐ రామాంజులు, ఎస్‌ఐ శివాంజులు పాల్గొన్నారు.

స్వర్ణ రథంపై దివ్యతేజం