
చెరువు తూములో పడి..
పెద్దకడబూరు: చిన్నతుంబళం గ్రామ రాయల చెరువు తూములో ప్రమాదవశాత్తు పడి యువకుడు పడి మృతి చెందిన సంఘటన సోమవారం వెలుగుచూసింది. ఏఎస్‌ఐ ఆనంద్ వివరాల మేరకు.. మంత్రాలయం మండలం మాధవరం గ్రామానికి చెందిన తెలుగు రఘు(32) పెద్దకడబూరు మండలం చిన్నతుంబళం గ్రామానికి చెందిన లింగమ్మతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు. అయితే వీరు గత 6 నెలలుగా చిన్నతుంబళం గ్రామంలోనే కార్పెంటర్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రఘు మద్యానికి బానిస అయ్యాడు. గత శనివారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. భార్య ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో ఆందోళన చెందారు. ఆదివారం అంతటా గాలించినా ఆచూకీ లభిచంలేదు. అయితే సోమవారం మధ్యాహ్నం రాయల చెరువు తూము నుంచి కాలువలోకి మృతదేహం కొట్టుకురావడంతో బట్టలు ఉతుకుతున్న మహిళలు గమనించి గ్రామస్తులకు చెప్పారు. సమాచారం అందుకున్న సంఘటన స్థలానికి చేరుకుని గుర్తు తెలియని శవంగా భావించారు. తర్వాత మృతదేహం రఘుదిగా ఆయన కుటుంబీకులు గుర్తించారు. చెరువు తూము దగ్గర మద్యం సేవిస్తూ ప్రమాదవశాత్తూ అందులో పడిపోయి ఉంటాడని కుటుంబీకులు అనుమానిస్తున్నారు. మృతుడి భార్య లింగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ తెలిపారు.
గల్లంతైన యువకుడి మృతి
పాణ్యం: రెండు రోజుల క్రితం ఎస్సార్బీసీ ప్రధాన కాల్వలో గల్లంతైన యువకుడు శవమై తెలాడు. ఎస్‌ఐ నరేంద్రకుమార్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. తమిళనాడు రాష్ట్రం తిరుపూర్ జిల్లా ఉడుమల్‌లై గ్రామానికి చెందిన కుమార్ పుంగుడిల కుమారుడు యువరాజ్(27) లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. రెండు రోజుల క్రితం కెమికల్ లోడ్‌తో కర్నూలు నుంచి చైన్నెకి వెళ్తుండగా పాణ్యం ఎస్సార్బీసీ ప్రధాన కాల్వ వద్ద స్నానం చేసేందుకు వాహనం నిలిపాడు. కాల్వలో దిగే క్రమంలో జారి పడి నీటి ఉద్ధృతికి కొట్టుకుపోయాడు. క్లీనర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం ఉదయం నుంచి కాల్వ వెంట డ్రోన్‌ల సహాయంతో పాణ్యం నుంచి నందివర్గం, రామతీర్థం నందవరం వరకు గాలించుకుంటూ వెళ్లారు. నందవరం పరిసరాల్లో నీటలో మృతదేహం లభ్యం కావడంతో బయటు తీసి పరిశీలించగా యువరాజ్‌గా గుర్తించారు. మృతదేమాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.
డ్రోన్‌తో శ్రీశైలంలో నిఘా
శ్రీశైలం టెంపుల్: శ్రీశైలంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణతో పాటు జూదం, గంజాయి విక్రయాలు.. తదితర అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు శ్రీశైలం పోలీసులు డ్రోన్ సేవలను ఉపయోగిస్తున్నారు. సోమవారం శ్రీశైలం సీఐ స్రసాదరావు, సిబ్బందితో కలిసి డ్రోన్ సహయంతో శ్రీశైలంలో పలు ప్రదేశాలను పరిశీలించారు. సాక్షిగణపతి, హఠకేశ్వరం, దాసరి అన్నసత్రం, దేవస్థానం టోల్‌గేట్, నందిమండపం, పాతాళగంగ జంక్షన్, ఆర్టీసీ బస్టాండ్ తదితర ప్రదేశాలలో పరిశీలించారు.