
దేవుడికి పూజారి శఠగోపం
● మట్కా ఆడి అప్పులపాలైన పూజారి
● దేవుడి వెండి ఆభరణాలు
విక్రయించేందుకు యత్నం
● ఆభరణాలు తరలిస్తుండగా
అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఆదోని అర్బన్: దేవుడి సేవలో తరించాల్సిన పూజారి మట్కాకు బానిసై అప్పులపాలయ్యాడు. అప్పుల బాధ నుంచి బయటపడేందుకు ఏకంగా దేవుడి ఆభరణాలపై కన్నేశాడు. వాటిని గుట్టుగా అపహరించి విక్రయించేందుకు తరలిస్తుండగా పోలీసులు రంగ ప్రవేశం చేసి అరెస్ట్ చేశారు. ఆదోని డీఎస్పీ హేమలత తెలిపిన వివరాల మేరకు.. ఆదోని మండలం నారాయణపురం గ్రామంలో వెలిసిన శ్రీ వసిగేరప్ప దేవాలయంలో పూజారిగా పనిచేస్తున్న గొర్రెల వసిగేరప్ప మట్కా ఆడుతూ అప్పులపాలయ్యాడు. బెంగళూరులో ఉంటూ మట్కా ఆడి అప్పులపాలయ్యాడు. ఈ క్రమంలో దేవుడి ఆభరణాలు అమ్మేసి బయటపడాలని భావించాడు. దీంతో గుడిలో ఉన్న విగ్రహాలను పది రోజుల క్రితం ఇంట్లో దాచి పెట్టాడు. అయితే ఆలయంలో 4.386 కేజీల వెండి ఆభరణాలు, 10 గ్రాముల బంగారు బాసింగం కనిపించడం లేదని ఆ గ్రామానికి చెందిన కురి చంద్ర ఈనెల 10వ తేదీన ఇస్వీ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో పూజారి వసిగేరప్ప తన ఇంట్లో దాచిన ఆభరణాలను కర్ణాటక రాష్ట్రం బళ్లారిలో విక్రయించేందుకు సోమవారం తరలిస్తుండగా చాగి గ్రామం శ్రీ మహాయోగి లక్ష్మమ్మవ్వ ముఖద్వారం సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆభరణాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. కేసు వివరాలను స్థానిక డీఎస్పీ బంగ్లాలో డీఎస్పీ హేమలత మీడియాకు వివరించారు. స్వాధీనం చేసుకున్న ఆభరణాలను ప్రదర్శించారు. కేసును ఛేదించిన ఆదోని రూరల్ సీఐ నల్లప్ప, ఇస్వీ ఎస్‌ఐ డాక్టర్ నాయక్, హెడ్‌కానిస్టేబుల్ రామయ్య, కానిస్టేబుళ్లు సుదర్శన్, ఖాసీంను డీఎస్పీ అభినందించారు.