
భువనమోహనుడికి బ్రహ్మరథం
● అశేష జనవాహిని మధ్య సాగిన రాఘవేంద్రుల రథయాత్ర ● అలరించిన కళాకారుల నీరాజనాలు
అశేష భక్తజన వాహిని మధ్య రాయరు రథోత్సవ దృశ్యం
మంత్రాలయం: భువనమోహనుడు మహారథంపై ఊరేగిన వేళ.. తుంగభద్రమ్మ మది పులకించిపోయింది. వేదభూమి పరవశించి ఆధ్యాత్మిక పరిమళాలతో శోభిల్లింది. భక్తజనం హర్షధ్వానాలతో జపించింది. రాఘవేంద్రస్వామి 354వ సప్తరాత్రోత్సవాల్లో భాగంగా మంగళవారం మహారథోత్సవం కనులపండువగా సాగింది. ఉత్తరారాధనలో భాగంగా ముందుగా ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయులు వేద పాఠశాలకు మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా చేరుకున్నారు. అక్క డ పాఠశాల విద్యార్థులు ఉత్సవమూర్తికి వేద పఠనం గావించి దర్శించుకున్నారు. అనంతరం శ్రీమఠం మూల బృందావనం చేరుకోగా స్వామి వారికి విశేష పూజలు గావించి వసంతోత్సవానికి శ్రీకారం పలికారు. గర్భాలయంలో అర్చకులు, పండితులు, పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు గులాలు చల్లుకుని ఆచార వైభవాన్ని స్పృశింపజేశారు. అనంతరం ఉత్సవమూర్తిని మహారథంపై కొలువుంచగా.. భక్తజనులు గోవిందా.. గోవిందా.. అంటూ ప్రణమిల్లుతూ దర్శించుకు న్నారు. పీఠాధిపతి ప్రవచనం ముగియగానే భక్తులను ఆశీర్వచనం చేస్తూ 12.15 గంటలకు రథయాత్రకు అంకురార్పణ పలికారు. మధ్వ కారిడార్ చేరుకోగానే స్వామిజీ హెలికాప్టర్‌తో పుష్పవృష్టి కురిపించారు. మంగళ వాయిద్యాలు, డోలు దరువులు, రంగుల ఆటలు, యువతుల సంప్రదాయ నృత్య ప్రదర్శనలు, కోలాటాల మధ్య మహారథం ముందుకు కదిలింది. రాఘవేంద్ర సర్కిల్ వద్ద స్వామిజీ పూర్వాశ్రమ కుటుంబ సభ్యులు ఉత్సవమూర్తికి పూజలు చేసుకుని మొక్కు లు తీర్చుకున్నారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ రథోత్సవంలో పాల్గొన్నారు. డీఎస్పీ వెంకటరామయ్య ఆధ్వర్యంలో సీఐలు, ఎస్‌ఐలు సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
రూ.250 కోట్లతో జలాశయం
మంత్రాలయం క్షేత్రం సౌకర్యార్థం రూ.250 కోట్లతో జలాశయాన్ని నిర్మిస్తున్నట్లు పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు తెలిపారు. వేడుకలో స్వామిజీ ప్రసంగిస్తూ క్షేత్రంలో అంతర్గత రహదారులతో పాటు రింగ్ రోడ్డు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. రాఘవేంద్ర సర్కిల్ వరకు కారిడార్ నిర్మిస్తామ న్నారు. శ్రీమఠం దినదినాభివృద్ధికి అంతరంగిక భక్తుల సహకారం ఎంతో ఉందన్నారు. వేడుకల్లో పండిత కేసరి రాజా ఎస్. గిరియాచార్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జ్ రాఘవేంద్రరెడ్డి, తహసీల్దార్ రమాదేవి, శ్రీమఠం ఏఏవో మాధవశెట్టి, మేనేజర్–1 శ్రీనివాసరావు, మేనేజర్–2 వెంకటేష్‌జోషి, మేనేజర్–3 శ్రీపతి ఆచార్ తదితరులు పాల్గొన్నారు.

భువనమోహనుడికి బ్రహ్మరథం

భువనమోహనుడికి బ్రహ్మరథం

భువనమోహనుడికి బ్రహ్మరథం

భువనమోహనుడికి బ్రహ్మరథం