
రానున్న మూడు రోజులూ వర్షాలే..
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు కోసిగి, తుగ్గలి మండలాల్లో మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది. అయితే వర్షాలు తేలికపాటి నుంచి ఒక మోస్తరుకే పరిమితం అయ్యాయి. వెల్దుర్తిలో 32.8, హాలహర్విలో 24.8, మద్దికెరలో 23.8, చిప్పగిరిలో 22.6, క్రిష్ణగిరిలో 18.8, ఆలూరులో 18.6, ఆస్పరిలో 15, గోనెగండ్లలో 14.2, ఓర్వకల్‌లో 11.2, హొళగుందలో 9.2, కల్లూరులో 7.8 మి.మీ ప్రకారం వర్షాలు కురిశాయి. జిల్లా మొత్తం మీద సగటున 9.5 మి.మీ వర్షపాతం నమోదైంది. ఆగస్టు నెల సాధారణ వర్షపాతం 116.2 మి.మీ ఉండగా.. ఇప్పటి వరకు 124.4 మి.మీ వర్షపాతం నమోదు కావడం గమనార్హం. కాగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రానున్న మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. ఒకటి, రెండు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ట్రిపుల్ ఐటీడీఎం రిజిస్ట్రార్ బాధ్యతల స్వీకరణ
కర్నూలు సిటీ: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ డిజైన్ మ్యాను ఫ్యాక్చరింగ్(ట్రిపుల్‌డీఎం) రిజిస్ట్రార్‌గా రాజ్ కుమార్ మాంఝీవాల్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర విద్యాశాఖతో సమన్వయం చేసుకొని ట్రిపుల్‌ఐటీడీఎం క్యాంపస్ రెండో దశ పనులను ప్రారంభిస్తామన్నారు. క్యాంపస్ కాంపౌండ్ వాల్‌ను పూర్తి చేసేందుకు చర్యలు చేపడతామన్నారు. దేశంలోని అగ్రశ్రేణి సాంకేతిక సంస్థలతో ట్రిపుల్‌ఐడీ పోటీ పడేలా తీర్చిదిద్దుతామన్నారు. ఇటీవల బదిలీ అయిన గురుమూర్తి స్థానంలో జైపూర్‌లోని మాలవ్య నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో డిప్యూటీ రిజిస్ట్రార్‌గా పని చేస్తున్న రాజస్థాన్‌కి చెందిన రాజ్‌కుమార్ మాంఝీవాల్‌ను నియమించారు. ఈయన ఐఐటీ జమ్మూకశ్మీర్, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్‌లో పని చేశారు. నూతన రిజిస్ట్రార్‌కు క్యాంపస్ అధ్యాపకులు స్వాగతం పలికారు.
22న మాజీ సైనికుల
సమస్యలకు పరిష్కారం
కర్నూలు(అర్బన్): మాజీ సైనికులు, ఆయా కుటుంబాల వితంతువుల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు ఈ నెల 22న మద్రాసు రెజిమెంట్‌కు చెందిన అధికారులు ఇక్కడకు వస్తున్నట్లు జిల్లా సైనిక సంక్షేమ అధికారి ఎస్.ఆర్.రత్నరూత్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయంలో ఆ రోజున ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంబంధిత అధికారులు అందుబాటులో ఉంటారన్నారు. మద్రాస్ రెజిమెంట్‌కు సంబధించిన వారు తమ సమస్యల పరిష్కారానికి పెన్షన్ పేమెంట్ ఆర్డర్, డిశ్చార్జి బుక్, అప్డేట్ బ్యాంకు పెన్షన్ పాస్ బుక్‌తో పాటు అవసరమైన ధృవపత్రాలతో స్వయంగా హాజరు కావాలన్నారు. మరిన్ని వివరాలకు సైనిక సంక్షేమ కార్యాలయ పనివేళల్లో 08518– 229445 నెంబర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.