జెడ్పీలో బదిలీల కౌన్సెలింగ్
● రాజకీయ పైరవీలు లేకుండా
నిబంధనల మేరకు బదిలీలు
● హర్షం వ్యక్తం చేస్తున్న
ఉద్యోగ సంఘాలు
కర్నూలు(అర్బన్): జిల్లా పరిషత్ పరిధిలోని ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన కౌన్సెలింగ్ ఆదివారం నిర్వహించారు. జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ బదిలీల్లో జెడ్పీ సీఈఓ జి. నాసరరెడ్డి, డిప్యూటీ సీఈఓ ఈవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. స్థానిక జెడ్పీలోని చైర్మన్ చాంబర్‌లో ఉద్యోగుల బదిలీలకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ప్రతి కేడర్‌లో ఐదేళ్లు ఒకే ప్రాంతంలో పనిచేసిన ఉద్యోగుల జాబితా, జిల్లాలో ఖాళీగా ఉన్న స్థానాలను డిస్‌ప్లే చేస్తూ, సీనియారిటీ ప్రకారం కౌన్సిలింగ్ నిర్వహించి బదిలీల ప్రక్రియ కొనసాగించారు. జెడ్పీ పరిధిలో ఒకే ప్రాంతంలో ఐదేళ్లు పూర్తి అయిన జాబితాలో పరిపాలనాధికారులు 05, సీనియర్ అసిస్టెంట్లు 15, జూనియర్ అసిస్టెంట్లు 17, టైపిస్టులు 03, రికార్డు అసిస్టెంట్లు 03, టైబ్రరీ అసిస్టెంట్లు 05, ల్యాబ్ అసిస్టెంట్లు 04, ఆఫీసు సబార్డినేట్లు 04, స్వీపర్లు 01 మంది ఉన్నారు. అలాగే ఐదేళ్ల లోపు ఉండి రిక్వెస్ట్ ట్రాన్స్‌ఫర్స్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ముగ్గురు ఎంపీడీఓలతో పాటు మిగిలిన కేడర్లలో 74 మంది ఉన్నారు. ఐదేళ్లు పూర్తి అయిన వారితో పాటు రిక్వెస్ట్ పెట్టుకున్న వారు మొత్తం 134 మంది వివిధ కేడర్లలోని ఉద్యోగులు బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. బదిలీలను కోరుకున్న మెజారిటీ ఉద్యోగులు ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలతో దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల మేరకు ఎలాంటి పైరవీలకు తావు లేకుండా జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి కౌన్సెలింగ్ నిర్వహించి ఉద్యోగుల బదిలీల ప్రక్రియను పూర్తి చేశారు. కేవలం ఆఫీస్ బేరర్స్, రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉన్న వారు, ఆరోగ్యపరంగా ఇబ్బంది ఉన్న వారికి మాత్రమే మినహాయింపు ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా ... పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా కౌన్సెలింగ్ నిర్వహించడంపై పీఆర్ మినిస్ట్రీయల్ ఉద్యోగ సంఘం నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులు ఇంకా జారీ కాలేదు.
గ్రామీణ నీటి సరఫరా విభాగంలో ...
ఆర్‌డబ్ల్యూఎస్‌లో ఉమ్మడి కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాలకు సంబంధించిన మినిస్ట్రీయల్ ఉద్యోగుల బదిలీలను నిర్వహించారు. స్థానిక సర్కిల్ కార్యాలయంలో ఎస్‌ఈ బి. నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ బదిలీలు జరిగాయి. ఆయా జిల్లాల పరిధిలోని కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న ఐదేళ్లు పైబడిన వారిని, రిక్వెస్టులను పరిగణనలోకి తీసుకొని బదిలీలు నిర్వహించారు. బదిలీ అయిన వారిలో ఇద్దరు సూపరింటెండెంట్లు, 30 మంది సీనియర్ అసిస్టెంట్లు, ముగ్గురు టెక్నికల్ ఆఫీసర్లు, నలుగురు అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్లతో పాటు పలువురు ఆఫీసు సబార్డినేట్లు ఉన్నారు.


