సీమ ప్రాజెక్టులను పూర్తి చేయాలి
నంద్యాల(న్యూటౌన్): రాయలసీమలో ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్–6 హామీలను వెంటనే అమలు చేయాలని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, కార్యదర్శి వర్గ సభ్యులు రామచంద్రయ్య, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామాంజనేయులు డిమాండ్ చేశారు. బుధవారం నంద్యాల పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో వారు మాట్లాడుతూ.. రాయలసీమకు నీటి వనరులైన హంద్రీ – నీవా, గాలేరునగరి, సిద్దేశ్వరం అలుగు, గుండ్రేవుల ప్రాజెక్టులను పూర్తి చేసేలా మహానాడులో తీర్మానం చేయాలన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రాంతీయ పార్టీలను భయపెడుతోందని, ప్రజలను మభ్యపెట్టి కార్పొరేర్లకు దేశ సంపదను దోచిపెడుతుందని ఆరోపించారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదో మహానాడులో నిలదీయాలన్నారు. ఆగస్టు 22 నుంచి 25 వరకు ఒంగోలులో జరిగే సీపీఐ రాష్ట్ర మహాసభలను, చండీఘర్‌లో సెప్టెంబర్ 25, 26 తేదీల్లో జరిగే జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి రంగనాయుడు, బాబాఫకృద్దీన్, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.


