రూ.21లక్షల విలువ చేసే 130 సెల్‌ఫోన్లు స్వాధీనం..! | Sakshi
Sakshi News home page

రూ.21లక్షల విలువ చేసే 130 సెల్‌ఫోన్లు స్వాధీనం..!

Published Thu, May 23 2024 4:15 AM

-

డోన్‌ టౌన్‌: పట్టణంలోని చిగురమానుపేటలో నిర్వహించిన కార్డన్‌ సెర్చ్‌లో రూ.21 లక్షల విలువ చేసే 130 సెల్‌ ఫోన్లు, రూ.1,48,500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. స్థానిక సర్కిల్‌ కార్యాలయంలో బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఎన్నికల కౌంటింగ్‌ని దృష్టిలో పెట్టుకొని కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించామన్నారు.

పట్టణంలో సమస్యాత్మకమైన చిగురమానుపేటలో పట్టణ, రూరల్‌ సీఐలు ప్రవీణ్‌కుమార్‌, అస్రత్‌బాషా, పట్టణ, రూరల్‌ ఎస్‌ఐలు శరత్‌కుమార్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డిలతో పాటు జలదుర్గం ఎస్‌ఐ విజయ్‌కుమార్‌లు మూడు పోలీసు స్టేషన్ల సిబ్బందితో కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారన్నారు. ఇందులో భాగంగా కాలనీకి చెందిన ఎరుకలి రవి అలియాస్‌ పిలక రవి ఇంట్లో తనిఖీలు చేస్తుండగా ఒక లగేజ్‌ బ్యాగ్‌లో దొంగలించుకొచ్చిన 130 సెల్‌ఫోన్లు, రూ.1,48,500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

రవిని అదుపులోకి తీసుకొని విచారించగా అతని సమీప బంధువులు ఎరుకలి నవాగ్‌ మరియు ఎరుకలి పవన్‌లు తమిళనాడు రాష్ట్రంకు వెళ్ళి అక్కడ రద్దీగా ఉన్న ప్రాంతాల్లో సెల్‌ఫోన్లు దొంగలించేవారన్నారు. వాటిని రవికి ఇవ్వగా హైదరాబాద్‌కు తీసుకెళ్ళి మహమ్మద్‌ ఖాజా నిజాముద్ధీన్‌ అలియాస్‌ ఖైజర్‌కు ఒట్టుగా అమ్ముతున్నట్లు వెల్లడైందన్నారు. స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్ల విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.21 లక్షలు ఉంటుందన్నారు. పైన తెలిపిన ముద్దాయిలు నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement