ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై వేంచేసిన దుర్గమ్మ వేద పరిరక్షణ ట్రస్ట్‌కు విశాఖపట్నానికి చెందిన భక్తులు శనివారం రూ.లక్ష విరాళం సమర్పించారు. విశాఖపట్నం రాజేంద్రనగర్‌కు చెందిన సుబ్రహ్మణ్యం ముత్య అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ అధికారులను కలిసి వేద పరిరక్షణ ట్రస్ట్‌కు రూ.1,00,116 విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతకు ఆలయ మర్యాదలతో దాతకు అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతకు ఆలయ డీఈఓ కిషోర్‌కుమార్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎ.శ్రావణ్‌బాబు పేర్కొన్నారు. ఆయన శనివారం విజయవాడలోని పలు అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతోపాటు జి.కొండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, గడ్డమణుగు హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది ముఖ హాజరు, రోగుల వివరాలు నమోదు, గర్భిణుల వివరాలు, ప్రసవాల సంఖ్య, ప్రసూతి గది నిర్వ హణ, సంబంధిత రికార్డులను తనిఖీచేశారు. ఆస్పత్రి ప్రాంగణంలోని పరిశుభ్రత, పచ్చదనం, పారిశుద్ధ్య నిర్వహణను తనిఖీ చేశారు. గర్భిణులకు సకాలంలో వైద్య పరీక్షలు నిర్వహించి, ప్రసవ సేవలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలు వురు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


