వైఎస్సార్‌ సీపీ గుడివాడ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా ప్రవీణ | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ గుడివాడ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా ప్రవీణ

Nov 15 2026 8:35 PM | Updated on Nov 15 2026 8:35 PM

వైఎస్సార్‌ సీపీ గుడివాడ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా ప్రవీణ

గుడివాడ టౌన్‌: త్వరలో జరగనున్న గుడివాడ పురపాలక సంఘ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా మెరుగుమాల ప్రవీణ పోటీ చేస్తున్నారు. వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు మెరుగుమాల కాళీ సతీమణి ప్రవీణ పేరును అధికారికంగా అధిష్టానం ప్రకటించింది. ఈ నెల 16వ తేదీ ఆదివారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ప్రవీణ నామినేషన్‌ దాఖలు చేస్తున్నట్లు తెలిపారు. స్థానిక నాగవరప్పాడు వంతెన సమీపంలోని శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో పూజల అనంతరం ర్యాలీగా వెళ్లి నామినేషన్‌ దాఖలు చేస్తారని పార్టీ నేతలు తెలిపారు.

కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలి

విమానాశ్రయం(గన్నవరం): రాష్ట్ర పర్యటన నిమిత్తం ఈ నెల 16వ తేదీ కేంద్ర హోం మంత్రి అమిత్‌షా రానున్నారు. దీనికోసం గన్నవరం విమానాశ్రయంలో శనివారం అధికారులు ముందస్తు భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ నవీన్‌ వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ హోం మంత్రి పర్యటన సందర్భంగా భద్రత, ప్రొటోకాల్‌ ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని సూచించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యేక వైద్య బృందాలను, అంబులెన్స్‌లు, అగ్నిమాపక వాహనాలను సిద్ధంగా ఉంచాలని తెలిపారు. విద్యుత్‌ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని ఆదేశించారు. కేంద్ర మంత్రి పర్యటించే ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని తెలిపారు. ఎయిర్‌పోర్ట్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేయాలని వివరించారు. కేంద్ర మంత్రి భద్రతా సిబ్బంది వికాస్‌కుమార్‌ సింగ్‌, సి.కణ్ణన్‌, నితీష్‌ భడోరియా, రంజన్‌ మొహంతి, అమిత్‌కుమార్‌, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

గ్రంథాలయాలు ఆధునిక దేవాలయాలు

విజయవాడ కల్చరల్‌: గ్రంథాలయాలు ఆధునిక దేవాలయాలని ఏపీ హౌసింగ్‌ డిపార్ట్‌మెంట్‌ సెక్రటరీ హెబ్సిబారాణి కొర్లపాటి అన్నారు. విజయవాడ బుక్‌ ఫెస్టివల్‌ సొసైటీ ఆధ్వర్యాన వారం రోజులు నిర్వహించే జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను విజయవాడ బుక్‌ ఫెస్టివల్‌ సొసైటీ గ్రంథాలయం రీసెర్చ్‌ రిఫరెన్స్‌ ప్రాంగణంలో శనివారం ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ ఆధునిక సమాజంలో శాస్త్ర సాంకేతిక అంశాల్లో మార్పులు వచ్చినా గ్రంథాలయాల ప్రభావం తగ్గలేదన్నారు. బుక్‌ ఫెస్టివల్‌ సొసైటీ అధ్యక్షుడు మనోహర నాయుడు మాట్లాడుతూ ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయన్నారు. ప్రారంభ కార్యక్రమంలో కార్యదర్శి లక్ష్మయ్య, ఫెస్టివల్‌ సొసైటీ సభ్యులు పలువురు పాల్గొన్నారు. అతిథి కొర్లపాటికి నిర్వాహకులు శంకరమంచి రచించిన అమరావతి కథల సంకలాన్ని అందజేశారు. పుస్తక ప్రదర్శనలో తెలుగు అనువాద గ్రంథాలు జీవిత చరిత్రలు, ఆధ్యాత్మిక గ్రంథాలు, బాల సాహిత్యం, ఆంగ్ల పుస్తకాలు అందుబాటులో ఉంచారు. ఉదయం 9 గంటలనుంచి రాత్రి 9 గంటల వరకు ప్రదర్శనను తిలకించవచ్చు.

పామర్రులో ఆస్ట్రేలియా బృందం

పామర్రు: స్థానిక యలమర్రు రోడ్డులోని ఏఎన్‌ఎం హైస్కూల్‌లో బాలల దినోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. పామర్రులో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా బృందం సభ్యులు ఏఎన్‌ఎం హైస్కూల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా జరిగిన పోటీల్లో చిన్నారులతో పాటు ఆస్ట్రేలియా బృందం సభ్యులు పాల్గొని చిన్నారులను ఉత్సాహపర్చారు. అనంతరం విద్యార్థులకు ఆస్ట్రేలియా బృందం సభ్యులు బహుమతులను అందజేశారు. ఏఎన్‌ఎం ప్రిన్సిపాల్‌ ఎ.పూర్ణచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement