నర్సింగ్‌ కాలేజీలో గ్రూపుల గోల! | - | Sakshi
Sakshi News home page

నర్సింగ్‌ కాలేజీలో గ్రూపుల గోల!

Nov 15 2026 8:35 PM | Updated on Nov 15 2026 8:35 PM

అడ్మినిస్ట్రేషన్‌ వ్యవహారాల్లో ఫ్యాకల్టీ జోక్యం

విద్యార్థినులను రెచ్చగొడుతున్నట్లు ఓ ఫ్యాకల్టీపై ఆరోపణలు

సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకుంటూ వివాదాస్పదం చేస్తున్న వైనం

లబ్బీపేట(విజయవాడతూర్పు): నర్సింగ్‌ విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించాల్సిన కళాశాలలో గ్రూపుల ఆధిపత్య పోరు తెరపైకి వస్తోంది. కొందరు ఫ్యాకల్టీ సభ్యులు బోధనకే పరిమితం కాకుండా అడ్మినిస్ట్రేషన్‌ వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాము చెప్పినట్లే జరగాలంటూ విద్యార్థినులపై ప్రభావం చూపుతూ, వారిని తమకు అనుకూలంగా వ్యవహరించేలా ప్రోత్సహిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏదైనా సమస్య తలెత్తినప్పుడు ప్రిన్సిపాల్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాల్సి ఉండగా, కొందరు ఫ్యాకల్టీ సభ్యులే సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు కళాశాలలో చర్చనీయాంశంగా మారాయి.

500 మందికి పైగా విద్యార్థినులు

గత ప్రభుత్వ హయాంలో విజయవాడలో బీఎస్సీ నర్సింగ్‌ కళాశాలను ఏర్పాటు చేశారు. ఏటా సుమారు వంద మందికి ప్రవేశాలు కల్పిస్తున్నారు. ప్రస్తుతం వివిధ సంవత్సరాల్లో నర్సింగ్‌ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినులతో పాటు ఇంటర్న్‌షిప్‌ చేస్తున్న వారు కలిపి దాదాపు 500 మందికి పైగా ఉన్నారు. కళాశాలలో ప్రిన్సిపాల్‌, బోధనా సిబ్బంది, పరిపాలనా సిబ్బంది పని చేస్తుండగా, పర్యవేక్షణ బాధ్యతలు రాష్ట్ర వైద్య విద్య సంచాలకుల కార్యాలయం పరిధిలోని నర్సింగ్‌ విభాగం చూస్తోంది. కొందరు ఫ్యాకల్టీ సభ్యుల వ్యవహార శైలితో కళాశాలలో అంతర్గత విభేదాలు పెరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.

ఓ ఫ్యాకల్టీ సభ్యురాలి తీరుపై విమర్శలు

ముఖ్యంగా ఫైనలియర్‌ విద్యార్థినుల వ్యవహారాలను పర్యవేక్షించే ఓ ఫ్యాకల్టీ సభ్యురాలి తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రెండు రోజుల క్రితం కళాశాలలో చోటుచేసుకున్న ఓ ఘటనకు సంబంధించి ప్రిన్సిపాల్‌కు సమాచారం ఇవ్వ కుండా ఆమె స్వయంగా నిర్ణయం తీసుకుని, విద్యార్థినులు తాను చెప్పిన విధంగానే వ్యవహరించాలని సూచించినట్లు ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థినులు కూడా ఆమె సూచనల మేరకు నడుచుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం ప్రిన్సిపాల్‌ దృష్టికి వెళ్లిన తర్వాత తనకు ముందుగా ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించినట్లు సమాచారం. అయితే దీనిపై స్పష్టమైన సమాధానం రాలేదని కళాశాల వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలోనూ ఇలాంటి వ్యవహారాల్లో ప్రిన్సిపాల్‌ ప్రమేయం లేకుండానే నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

గతంలోనూ ఫిర్యాదులు?

సదరు ఫ్యాకల్టీ సభ్యురాలిపై గతంలో కొందరు నర్సింగ్‌ విద్యార్థినులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. తమను వేధిస్తున్నారని, చెప్పినట్లు వినకపోతే మార్కులు తగ్గిస్తానంటూ బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆ ఫిర్యాదులపై విచారణ ఏ మేరకు జరిగిందన్నది స్పష్టత లేదు. సమస్య పరిష్కారం కాకపోవడంతోనే ప్రస్తుతం కూడా ఇదే తరహా ఆధిపత్య ధోరణి కొనసాగుతోందని కొందరు విద్యార్థినులు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై ప్రిన్సిపాల్‌ను వివరణ కోరదామని ‘సాక్షి’ ప్రయత్నించగా అందుబాటులో లేరు.

ఉన్నతాధికారులు స్పందించాలి

విద్యార్థులకు విద్యాబోధన, క్రమశిక్షణ, నైపుణ్యాల పెంపుపై దృష్టి సారించాల్సిన ఫ్యాకల్టీ సభ్యులు అంతర్గత విభేదాలు, గ్రూపుల రాజకీయాల్లో తలమునకలవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలు కళాశాల విద్యా వాతావరణంపై ప్రభావం చూపే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి, ఆరోపణలపై నిష్పక్షపాత విచారణ జరిపి, ప్రశాంతమైన విద్యా వాతావరణం నెలకొనేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement